పెళ్లి విందు సరే.. బిర్యానీలో ఉల్లి సంగతేంటి..?

9 Dec, 2019 15:32 IST|Sakshi

చెన్నై: పెళ్లి అంటేనే సందడి.. చుట్టాలు, స్నేహితులతో నిండిపోయే మండపంలో ఉన్న కోలాహలం చూస్తే అందరు అక్కడ బిజీబిజీగా కనిపిస్తారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ఇకపోతే ఏదైన ఫంక్షన్స్‌కు ఖాళీ చేతులతో వెళ్లకూడదని బంధువులు, స్నేహితులు వివిధ కానుకలు తీసుకొచ్చి నూతన వధూవరులకు వాటిని అందజేసి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లి బాగా పాపులర్ అయింది. దాన్ని కొనాలంటే సామాన్యుడు హడలిపోతున్నాడు. ఇంకేముంది కొత్త జంటలకు ఉల్లిని గిఫ్ట్‌గా ఇచ్చి వినూత్నంగా తమ నిరసన తెలపడంతో పాటు.. వాటినే గిఫ్ట్‌గా అందిస్తూ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.
చదవండి: హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.200

వివరాల్లోకెళ్తే.. తాజాగా బెంగళూరులో ఓ నూతన జంటకు ఉల్లి గిఫ్ట్ ఇచ్చినట్టుగానే తమిళనాడులో జరిగిన పెళ్లిలో స్నేహితులు ఉల్లి గిఫ్ట్‌గా ఇవ్వడం వైరల్‌గా మారింది. కడలూరులోని మంజకుప్పంలో ఆదివారం ఓ పెళ్లిలో ఇది జరిగింది. నూతన జంట షాహుల్, సబ్రినా వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. పెళ్లికి వచ్చిన బంధువుల కోసం మంచి విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి బిర్యానీ చేయించి వడ్డించారు. కానీ.. దాంట్లోకి ఉల్లిపాయలకు బదులు రైతా, కీరాతో సరిపెట్టారు. ఉల్లి కొరత కారణంగా ఇలా చేసినట్టు వధువు కుటుంబం చెప్పడంతో దీనిని గమనించిన వరుడి స్నేహితులు ఉల్లిపాయలను గిఫ్ట్‌గా ఇచ్చి నూతన జంటను ఆశ్చర్యపరిచారు. కడలూరులోని ఒక దుకాణం నుండి 2.5 కిలోల ఉల్లిని రూ.500లకు కొని దంపతులకు గిఫ్ట్‌గా ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు