కన్నా.. నువ్వు లేక మేము లేము

9 Jan, 2017 01:35 IST|Sakshi
కన్నా.. నువ్వు లేక మేము లేము

కన్నబిడ్డ జ్ఞాపకాలతో కుమిలిపోతూ దంపతుల ఆత్మహత్య

గుంటూరు(పట్నంబజారు): ఒక్కగానొక్క బిడ్డ.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బాగా చదివించి ఉన్నత శిఖరాలు అధిరో హించేలా చెయ్యాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు రావాలని కుమారుడిని శ్రీచైతన్య స్కూల్లో చేర్చారు. కుమారుడికి జ్వరం వస్తే ఆ స్కూలు హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం బాలుడి నిండుప్రాణాలు బలిగొంది. కుమారుడి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక వారూ బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు నగరంలో శనివారం జరిగిన ఈ ఘటన పలువురికి కంటతడి తెప్పించింది. రవీంద్రనగర్‌ మూడో లైన్‌లో నివాసం ఉండే నూనె చంద్రశేఖర్‌(43)కు భార్య నవీన(39), కుమారుడు వంశీకృష్ణ(14) ఉన్నారు.

కుమారుడికి నగర శివారులోని రెడ్డిపాలెంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో చేర్పించారు. అక్కడి హాస్టల్లో ఉంటున్న బాలుడికి జ్వరం వచ్చినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్‌ 22న వంశీకృష్ణ మృతి చెందాడు. దీన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి మానసికంగా కృంగిపోయారు. ఈ క్రమంలో వారు శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున చంద్రశేఖర్‌ తండ్రి సుబ్రమణ్యం లేచి చూసేసరికి వంటింట్లో భార్య, భర్తలు కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించారు. సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.