కోలీకి ఉరి అమలవుతుందా?

6 Sep, 2014 22:24 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీన కోలీకి ఉరి తీయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అతడిని ఉరి తీసేందుకు తగిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే వాస్తవానికి కోలిని 12వ తేదీన ఉరి అమలవుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అతడిపై పెట్టిన ఇతర కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా, అతడిని కొత్తగా రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఉరి మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
 
 ఈ నెల 12వ తేదీన తనకు అమలు చేయనున్న ఉరి శిక్షపై చాంబర్స్ ఆఫ్ జడ్జెస్‌లో వేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తులు బహిరంగ కోర్టులో అతడు రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన 14 ఏళ్ల రింపా హల్దార్ అనే బాలిక హత్య కేసులో కోలీకి కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా, కోలీ ఉరిశిక్ష అమలు అయితే అతడిపై ఉన్న ఇతర 15 కేసులు మూసివేయాల్సి ఉంటుందని, దాంతో ఆయా బాధిత కుటుంబాలకు అన్యాయం చేసినట్లే అవుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో నాలుగు కేసులు విచారణ దశలో, 11 కేసులు అప్పీల్ దశలో ఉన్నాయి. వీటిలోని 8 కేసుల్లో కోలీ యజమాని మణిందర్ సింగ్ పంధేర్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులన్నింటిలోనూ ప్రధాన సాక్షి కోలీ మాత్రమే. ఒకవేళ కోలీకి ఉరిశిక్ష అమలు అయితే ఆ కేసులన్నీ మూసేయాల్సి ఉంటుంది.
 
 ఇదిలా ఉండగా ఒక మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఒక నేరస్తుడిపై ఉన్న అన్ని కేసుల విచారణ పూర్తయిన తర్వాతే అతడికి ఉరిశిక్ష విధించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా మాట్లాడుతూ ఒక నేరస్తుడిపై ఉన్న అన్ని కేసులు కొట్టేసిన తర్వాతే ఉరి తీయాలని ఏ చట్టంలోనూ లేదని స్పష్టం చేశారు.  కోలీ ఉరిశిక్ష ఇతర నిఠారీ కేసులపై ప్రభావం చూపుతుందని సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ అన్నారు. ‘పంధేర్‌పై నడుస్తున్న కేసుల్లో విచారణ చేపట్టేందుకు కష్టమవుతుంది.
 
 చాలా కేసుల్లో వీరిద్దరినీ ఒకే చట్టం కింద అరెస్టు చేశారు..ఒకవేళ కోలీని ఉరితీసేస్తే తర్వాత ఆయా కేసులను నిరూపించడం ప్రాసిక్యూషన్‌కు సాధ్యమవుతుందా..?’ అని ఆయన ప్రశ్నించారు. ‘నిఠారీ కేసుల్లో చాలావరకు క్రాస్ ఎగ్జామిన్ దశలో ఉన్నాయి.. క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కోలీ లేకపోతే అది ఆయా కేసులపై తప్పక చెడు ప్రభావం చూపుతుంద’ని సుప్రీంకోర్టు న్యాయవాది జ్ఞానంత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కోలీని ఈ నెల 12వ తేదీన ఉరితీయాలని కోర్టు అనుకుంటే అతడిపై ఉన్న మిగిలిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు