చెత్త వేస్తే వాతే..

15 Jun, 2016 02:03 IST|Sakshi
చెత్త వేస్తే వాతే..

* జరిమానాల మోత
* పొగరాయుళ్లపై భరతం
* వీధుల్లోకి అధికారులు

సాక్షి, చెన్నై: కోర్టు అక్షింతలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, పోలీసులు పరుగులు తీస్తున్నారు. పొగరాయుళ్ల భరతం పట్టే విధంగా జరిమానాల మోత మోగించే పనిలో పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే చాలు కేసుల నమోదు, జరిమానా విధించే పనిలో పడ్డారు. ఇక, రైల్వేస్టేషన్లలో చెత్త వేస్తే రూ. ఐదు వేల వరకు జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

అలాగే, ప్రతి రోజూ ఉదయం అధికారులు చెన్నై నగరంలోని వీధుల్లో తిరుగుతూ, ఆరోగ్య, పారిశుద్ధ్య పనుల పరిశీలనకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏదేని ఘటన జరిగితే తాము స్పందిస్తాం అన్నట్టుగా అధికారులు వ్యవహార శైలి ఆది నుంచి వస్తున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నిషేధం అమల్లో ఉన్న, ఆచరణలో పెట్టే వాళ్లు లేరు. చివరకు హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో అధికారులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం సేవించే వారిపై చట్టపరంగా తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను ఈనెల 20లోపు కోర్టులో సమర్పించాల్సి ఉండడంతో అందుకు తగ్గ చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఆలయా లు, పాఠశాలలు, జనసంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాలపై పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది దృష్టి పెట్టారు. మఫ్టీల్లో బడ్డీ కొట్టులు, పాన్ షాపుల వద్ద తిష్ట వేశారు.

ఎవరైనా సరే,దుకాణాల్లో సిగరెట్లు కొని అలా వెలిగించి ఓ దమ్ము కొడుతూ, రోడ్డ మీద గానీ, ఫుట్‌పాత్ మీదగానీ కన్పిస్తే చాలు చటుక్కున పట్టుకుని భరతం పట్టే దిశగా అధికారుల పరుగులు సాగాయి. ఒక్క చెన్నై నగరంలో ఒక్క రోజులో 355 మందిపై కేసులు పెట్టడం గమనార్హం. వీరందరికి తొలి హెచ్చరికగా తలా రూ.రెండు వందలు చొప్పున జరిమానాలు విధించారు. ఈ తనిఖీలు పర్వం కొనసాగుతూ వస్తున్నది. ఇదే విధంగా కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తూత్తుకుడి, తిరునల్వేలి, సేలం, వేలూరు నగరాల్లోనూ తనిఖీలు సాగాయి.

పెద్ద ఎత్తున కేసుల నమోదు, జరిమానా మోతతో తాము తీసుకున్న చర్యల నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు తగ్గట్టుగా అధికారులు పొగరాయుళ్ల భరతం పట్టే పనిలో నిమగ్నం కావడం గమనార్హం.
 చెత్త ఏరి వేత: పొగరాయుళ్ల భరతం పట్టే విధంగా ఓ వైపు ప్రత్యేక డ్రైవ్ సాగుతుంటే, మరోవైపు  క్లీన్ ఇండియా నినాదంతో చెత్త తొలగింపు మీద దృష్టి పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా రైల్వేస్టేషన్లలో, రైల్వే ప్లాట్‌ఫాంలలో, రైలు బోగీలలో చెత్త చెదారాలు వేస్తే జరిమానాల మోత మోగనున్నది.

ఇది వరకు  రూ. ఐదు వందల వరకు జరిమానా వసూళ్లు చేయగా, ప్రస్తుతం రూ. ఐదు వేలు జరిమానా విధించడ ం జరుగుతుందని ప్రకటించిన అధికారులు, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు, చెన్నైలోని ఎలక్ట్రిక్ రైళ్లల్లో చెత్త వేసే వారి భరతం పట్టే విధంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి  దిగడం విశేషం. ఇక, చెన్నై కార్పొరేషన్ పరిధిలో అధికారులు ప్రతిరోజూ ఉదయం ఏడు గంటల కంతా రోడ్డెక్కాల్సిందే. ప్రజారోగ్యం పరిరక్షణ, చెత్త రహిత చెన్నై తీర్చిదద్దడం లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ఉన్నారు.

మరిన్ని వార్తలు