‘‘మమ’’ అనిపించారు

23 Mar, 2020 08:36 IST|Sakshi
తూత్తుకుడిలో మాస్క్‌లతో

మాస్క్‌లతో వధూవరులు

జనతా కర్ఫ్యూలో వంద మేరకు వివాహాలు

ఆలయాల ముందు నిలబడి తాళికట్టు

కొత్త జంటల ముఖాల్లో కానరాని చిరునవ్వు

వేద మంత్రాలు, మంగల వాయిద్యాల నడుమ బంధు జనం సమక్షంలో అగ్ని  సాక్షిగా ఏడడుగులు వేయించి వధూవరులను మాంగళ్యధారణతో ఏకం చేసే వేడుక వివాహం. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు జీవిత పయనం సాగిస్తామని∙అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడంతోపాటు జీలకర్ర, బెల్లం నెత్తిన పెట్టి, తలంబరాలు పోసి ఎంతో ఆనందోత్సాహాలతో వివాహ వేడుకలు జరగడం చూశాం. అయితే, తాజాగా ఆ పరిస్థితి అన్నది కాన రాలేదు.  కరోనా పుణ్యమా వేడుకను హడావుడిగా ముగించుకోవాల్సిన పరిస్థితి. ఆనందంతో, చిరునవ్వులతో బంధు మిత్రుల్ని ఆహ్వానిస్తూ, వేదిక మీద నిలబడి ఆహ్వానించాల్సిన కొత్త జంటల ముఖాల్లో వాటిని ఈ కరోనా దూరం చేసింది. అనేక పెళ్లిల్లు వాయిదా పడగా, మరికొన్ని ఏదో మమా అనిపించే రీతిలో ఆదివారం జరిగాయి.

సాక్షి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అందుకే తమ పిల్లల వివాహాలను కుటుంబాలు, ఆప్తులు, బంధుమిత్రులు అంటూ అందర్నీ ఆహ్వానించి అత్యంత ఘనంగా తల్లిదండ్రులు నిర్వహించడం జరుగుతున్నాయి. అయితే, కరోనా రూపంలో హఠాత్తుగా వచ్చిపడ్డ జనతా కర్ఫ్యూ రూపంలో హడావుడిగా మమా అనిపించే రీతిలో ఆదివారం అనేక వివాహాలు రాష్ట్రంలో జరిగాయి. సందడి లేని పెళ్లిల్లు వందకు పైగా జరిగినా, కొన్ని ఆలయాల ముందు మంత్రోచ్ఛరణలు, ఆశీర్వచనాలు అన్నది కూడా లేకుండా నిమిషాల వ్యవధిలో ముగించేశారు. 

రాష్ట్రంలో నాలుగు నెలల క్రితమే అనేక కుటుంబాలు తమ పిల్లలకు వివాహ ముహూర్తాల్ని కుదుర్చుకున్నాయి. కల్యాణ మండపాలకు, కేటరింగ్‌లు, అలంకరణలు, హంగామా, సంగీత విభావరి సందడి వాతావరణం అన్నట్టుగా అన్ని ఏర్పాట్లకు అడ్వాన్స్‌లను ఇచ్చుకున్న వాళ్లు ఎక్కువే. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికల్ని పంచి పెట్టే చేశారు. ఈ సమయంలో కరోనా రూపంలో పెళ్లి వేడుకలకు ఆటంకాలు తప్పలేదు. ముందుగా రిజర్వు చేసుకున్న వాళ్లకు తప్పా, కొత్తగా బుకింగ్‌లు చేయవద్దని కల్యాణ మండపాలకు ఆదేశాలు సైతం ప్రభుత్వం నుంచి వెళ్లాయి. అలాగే, ఆయా కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తూ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట జనాన్ని చేర్చవద్దని వేడుకున్నారు. అలాగే, వివాహ వేడుకకు ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో అనేక కుటుంబాలు వివాహాల్ని వాయిదా వేసుకోగా, ముందుగా నిర్ణయం తీసుకున్న కుటుంబాలు మాత్రం ఆదివారం సందడి అన్నది లేకుండా తమ పిల్లల వివాహాలు జరుపుకోవాల్సి వచ్చింది.

ఆలయాల ముందు..
 తమిళనాట గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు అత్యధికంగా తమ కులదేవతల ఆలయాల్లో వివాహం జరపడం, తమ గ్రామల్లో విందు వేడుక ఏర్పాటు చేసుకోవడం సహజం. అయితే, తాజాగా ఆ పరిస్థితి అన్నది కనిపించలేదు. ఆదివారం శుభ ముహూర్త వేళ కావడంతో వంద మేరకు జంటల వివాహాలకు ముందుగానే నిర్ణయం జరిగింది. దీంతో ఆయా కుటుంబాల వివాహ వేడుకలు ఏదో జరిగింది అన్నట్టుగా జరుపుకోవాల్సి వచ్చింది. వధువరులు మాస్క్‌ల ధరించడం, వారి చుట్టు ఉన్న వాళ్లు మాస్క్‌లు వేసుకోవడం, ఏదో పది, పదిహేను మంది అత్యంత సన్నిహితుల్ని ఆహ్వానించి శానిటైజర్లు, క్రిమి సంహారక మందుల వాసనల నడుమ  అతి పెద్ద కల్యాణ మండపాల్లో వివాహాలు నిర్వహించారు. పన్నీరు ఉండాల్సిన చోట, శానిటైజర్లను ఉంచి, చేతులు శుభ్రం చేసుకుని లోనికి వెళ్లక తప్పలేదు. ఇక, ఇదే రోజున సుశీంద్రం ఆలయంలో 110 జంటలకు వివాహాలు జరగాల్సి ఉండగా, అవి రద్దయ్యాయి. అయితే, కొన్ని జంటలు ఆలయం ముందు నిలబడి కనీసం మాంగల్యం తంతునామేనా...నవజీవన హేతున...అన్న మంత్రం కూడా లేకుండా అటు వచ్చి...ఇటు నిమిషాల వ్యవధిలో మాంగల్యధారణను ముగించి వెళ్లిపోయారు. తిరునల్వేలిలోని కుమారస్వామి ఆలయంలో పదిహేనుజంటలు వివాహం నిమిత్తం సిద్ధమయ్యారు. అయితే, ఆలయం మూతతో అక్కడి మండపంలో వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఆలయ అర్చకుడు స్పందించి, ఒక్కో జంటను ఆలయంలోకి తీసుకెళ్లి వివాహం జరిపించారు. పదిహేను నిమిషాలకు ఓ వివాహం అన్నట్టుగా ఇక్కడ తంతు సాగింది.

ఈ పదిహేను నిమిషాల వ్యవధిలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, ఓక్కో జంటను, వారి తల్లిదండ్రులను మాత్రం ఆలయంలోకి అనుమతించడం గమనార్హం. తిరువారూర్‌ తిరుత్తురై పూండిలోని మారియమ్మ ఆలయం , కడలూరు జిల్లా విరుదాచలం మైలం మురుగన్‌ ఆలయం, ధర్మపురి, కృష్ణగిరిల్లో కొన్ని జంటలు ఆలయాల ముందు నిలబడి మాంగల్య ధారణతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. కల్యాణ మండపాలను బుక్‌ చేసుకుని ఆనందోత్సాహాలు వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డ వారు, రోడ్డు మీద నిలబడి, ఆలయాల ముందు, చిన్నచిన్న ఆలయాల్లో వివాహాలు జరుపుకున్న జంటల ముఖాల్లో కరోనా రూపంలో చిరునవ్వు కూడా కరువు కావడం గమనార్హం. ఇక, వీరాభిమాని ఒకరు ఏకంగా విరుగ్గంబాక్కంలోని డీఎండీకే అధినేత విజయకాంత్‌ ఇంటికి తనకు కాబోయే భార్య, కుటుంబీకులతో వచ్చేశాడు. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సమక్షంలో పూలమాలలు మార్చుకుని, వివాహం చేసుకున్నాడు. వీరికి తన వంతుగా ఆశీర్వచనాలతో పాటు కానుకను విజయకాంత్‌ అందజేశారు.

కంచిలోని ఓ కల్యాణ మండపంలో కేవలం కుటుంబానికి చెందిన పదిమందితో పెళ్లి తంతును ఓ జంటకు ముగించారు. ఈరోడ్డు, పుదుకోట్టై, కోయంబత్తూరులలో కొన్ని వివాహాలు అతి పెద్ద కల్యాణ మండపాల్లో జరిగినా, అసలు వివాహం జరిగినట్టుగా సందడి అన్నది లేదు. కొన్ని వివాహాలు ఉదయం ఆరుగంటలలోపే ముగియగా, మరికొన్ని ఏడెనిమిది గంటలకు ముగించేశారు. ఇక, మైనారిటీ కుటుంబాల పిల్లల వివాహాలు కూడా జరగ్గా, బిర్యానీ విందును స్వీకరించిన వాళ్లు మరీ తక్కువే. అలాగే, నాగపట్నం ఎస్‌పీ రోడ్డులోని ఓ కుటుంబం మాత్రం కరోనాతో తమకేంటి అన్నట్టుగా హంగామాతో ముందుకు సాగింది. భాజాభజంత్రీలు, బ్యాండ్‌ వాయిద్యాలు అంటూ ఊరేగింపుగా వివాహ వేడుక జరగడం గమనార్హం. ఇక, వివాహ వేడుకలు జరిగిన కల్యాణ మండపాల వద్ద కరోనాను తరిమికొట్టేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.

మరిన్ని వార్తలు