బస్సుకు ‘వేప’ తోరణం

23 Mar, 2020 08:40 IST|Sakshi
బస్సులోపల కట్టిన వేప తోరణం

పసుపు మయం, నిమ్మకాయల మాల

గాంధీపురంలో వీడియో వైరల్‌

సాక్షి, చెన్నై : ఝూమ్‌.. మంత్రకాళి అంటూ కరోనాను తరిమి కొట్టేందుకు కోయంబత్తూరు గాంధీపురం గ్రామస్తులు సిద్ధమయ్యారు. తమగ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సులో సురక్షిత ప్రయాణానికి తగ్గ ఏర్పాటు చేసుకున్నారు. బస్సును వేప ఆకుల తోరణాలతో ముంచెత్తారు. పసుపు నీళ్లు చల్లి, నిమ్మకాయల మాలవేసి మరీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.  కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో జనంలో ఆందోళన రెట్టింపవుతోంది. నగర వాసుల్లోనే కాదు, కుగ్రామాల్లోని ప్రజలను ఈ వైరస్‌ వణికిస్తోంది. మరోవైపు వైరస్‌ను తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోలో కోయంబత్తూరు శివారులో కేరళ సరిహద్దుల్లో ఉన్న కుగ్రామం గాంధీపురం వాసులు మరింత అప్రమత్తమయ్యారు. పాతకాలపు పద్ధతులు అంటూ, అమ్మ వారు వచ్చినప్పుడు, గాలి సోకినా, గ్రామాల్లో ఏదేని రుగ్మతులు సోకినప్పుడు ఏ విధంగా ఆచరిస్తారో అదే తరహాలో ముందుకు సాగారు. (కరోనా కట్టడి : లాక్డౌన్లు సరిపోతాయా?)

బస్సుకు తోరణం...
తమ గ్రామం అటూ కేరళ, ఇటు తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఆ గ్రామస్తులు ఆందోళనలో పడ్డారు. గ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సును గ్రామస్తులే శుభ్రం చేశారు. గ్రామం నుంచి వివిధ పనులు నిమిత్తం కోయంబత్తూరుకు వెళ్లాల్సి ఉండడంతో, ఈ బస్సే దిక్కు. తమ బస్సును శుభ్రం చేయడంతో పాటు దానికి వేపాకులతో తోరణాలు కట్టారు. బస్సు చుట్టూ, సీట్లలో వేప ఆకుల్ని వేశారు. బస్సు ముందు భాగంలో నిమ్మకాయలతో పాల, అక్కడక్కడా బస్సు లోపల నిమ్మకాయలు ఉంచారు. బస్సును పసుపు మయం చేసే విధంగా పసుపు పూయడమే కాదు, పసుపు నీళ్లు చల్చారు. పయనం చేసే వాళ్లందరూ చేతులు, కాళ్లను, పసుపు నీళ్లతో శుభ్రం చేసుకున్న అనంతరం బస్సులోకి అనుమతించారు. శనివారం సాగిన ఈ వ్యవహారానికి తగ్గ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బస్సుల్లో ఎక్కే క్రమంలో కొందరు అయితే.. ఝూమ్‌.. మంత్రకాళి కరోనా... పారిపో.. అంటూ నినాదించడం గమనార్హం. (‘‘మమ’’ అనిపించారు)

మరిన్ని వార్తలు