మంత్రి 'పల్లె’ కు ముచ్చెమటలు!

21 Sep, 2016 19:57 IST|Sakshi
మంత్రి 'పల్లె’ కు ముచ్చెమటలు!

- సర్వజనాస్పత్రి సమస్యలు తీర్చాలంటూ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని చుట్టుముట్టిన సీపీఎం కార్యకర్తలు
- రెండు గంటల పాటు నడిరోడ్డుపై దిగ్బంధం
- తనవల్ల కాదంటూ పరుగు పెట్టిన మంత్రి


అనంతపురం సిటీ : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని సీపీఎం కార్యకర్తలు ముప్పుతిప్పలు పెట్టారు. రెండు గంటలకు పైగా నడిరోడ్డుపై దిగ్బంధించారు. వారి నుంచి తప్పించుకుపోవడానికి మంత్రి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అనంతపురం బోధనాస్పత్రిలో పడకల పెంపు, సిబ్బంది కొరత నివారణకు ఉద్దేశించిన 124 జీవోను తక్షణం అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ గేయానంద్ ఆస్పత్రి ఎదుట దీక్ష చేపట్టారు. బుధవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆ మార్గంలో పార్టీ కార్యాలయానికి వెళుతూ సీపీఎం కార్యకర్తలకు తారసపడ్డారు.

దీంతో వారు వాహనాన్ని అడ్డుకున్నారు. మంత్రిని చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకోవడానికి పల్లె అటూ ఇటు పరుగులు పెట్టారు. అయినా వారు వదలలేదు. పూర్తిగా దిగ్బంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. వారికి సమాధానం చెప్పలేని మంత్రి.. గేయానంద్‌తో మాట్లాడేందుకు శిబిరం వద్దకు బయలుదేరారు. అయితే.. ఆయన అక్కడికి వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మూడురోజులుగా దీక్ష చేస్తుంటే ఇంతవరకు ఏం చేస్తున్నారని నిలదీశారు.

ఈ క్రమంలోనే పోలీసులకు, సీపీఎం కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాట నుంచి తప్పించుకునేందుకు మంత్రి ప్రయత్నించగా.. ఆయన పాదరక్షలు రోడ్డు డివైడర్ల మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో పట్టు తప్పి కిందకు పడబోయారు. ఇదే సమయంలో ఆందోళనకారుల్లోని కొంత మంది యువకులను చూసిన మంత్రి..‘ నేను లెక్చరర్‌గా ఉన్నప్పుడు మీరు నా దగ్గర చదువు కున్నారు కదరా? నన్నే ఇలా నడిరోడ్డుపై ఇబ్బంది పడితే ఎలా?’ అంటూ వాపోయారు. ఈ సమస్య పరిష్కరించడం తన వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో మీ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చివరికి మంత్రి పాదరక్షలను కూడా అక్కడే వదిలి, కారును నడిరోడ్డుపై విడిచి పరుగు అందుకున్నారు. చివరకు పోలీసులు ఆయన్ను రక్షించి.. మరో వాహనంలో పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు