రైతుల నెత్తిన అకాల పిడుగు

9 Mar, 2014 22:04 IST|Sakshi
రైతుల నెత్తిన అకాల పిడుగు

 సాక్షి, ముంబై: కొన్నిరోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ  ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పశువులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయాయి. చేతికొచ్చిన పంటలు, బత్తాయి, మామిడి, ద్రాక్ష తదితర తోటల్లో పండ్లు నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటి నుంచి తేరుకోకముందే ధుళే జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి చల్లని ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షంవల్ల వెయ్యికి పైగా మేకలు, గొర్రెలు మృతి చెందాయి. వాటిపైనే ఆధారపడిన గొర్రెల మంద యజమానులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ.ఐదు లక్షలకుపైగా నష్టపోయామని గొర్రెల యజమానులు బోరుమన్నారు. జిల్లా కలెక్టర్ ప్రకాశ్ మహాజన్‌తోపాటు తహసీల్ధార్ దత్తా శేజ్వాల్ ఘటనాస్థలికి చేరుకుని నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 మేకల కాపరులకు ప్రభుత్వం ద్వారా సాధ్యమైనంత త్వరగా నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఖాందేశ్ ప్రాంతంలోని ధుళే, నందూర్బార్ జిల్లా లో గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అయితే శనివారం రాత్రి వర్ష తీవ్రత ఎక్కువైంది. దీంతో పాచోర్ తాలూకాలో చల్లని గాలులవల్ల ఓ రైతు మృతి చెందాడు. జామ్‌నేర్ తాలూకాలో పిడుగుపడి ఓ రైతు దుర్మరణం చెం దాడు. నందూర్బార్‌లో అడవిలోకి మేతకు వెళ్లిన మేకలు, గొర్రెలు చలి కారణంగా కొన్ని మరణిం చగా, మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సందెట్లో సడేమియా అన్నట్లు రైతులను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడం మొదలైంది. ఇదివరకు పత్తాలేకుండా పోయిన ప్రజాప్రతినిధులు అకాల వర్షాల పుణ్యమా అని ఏ గ్రామంలో చూసినా వారి పర్యటనలే కనిపిస్తున్నాయి.  నష్టపరిహారం చెల్లించేలా చూస్తామని హామీలు ఇవ్వడం, రైతులను ఓదార్చడం లాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.
 
  ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఆకా శం మబ్బులు కమ్ముకుని ఉండడంవల్ల పంటలు, పండ్ల నాణ్యత తగ్గిపోయి గిట్టుబాటు ధర లభిం చదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ద్రాక్ష పంటలకు ప్రసిద్ధి చెందిన నాసిక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ద్రాక్ష పంట కోతకు వచ్చింది. కానీ చల్లని గాలుల వల్ల ద్రాక్ష  చెట్లపైనే కుళ్లిపోయి పూర్తిగా దెబ్బతింటున్నా యి. కనీసం పెట్టుబడైనా  తిరిగి వస్తుందా అనే నమ్మకం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు