25 ఏళ్లు.. జవాన్‌ జాడ లేదు

22 Feb, 2019 12:08 IST|Sakshi
జవాన్‌ రఫి (ఫైల్‌) రఫి డ్యూటీలో ఉండగా రాసిన ఉత్తరాలతో తల్లిదండ్రులు ఖలందర్, మెహరున్నిసా

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ రఫి ఎక్కడున్నాడో?  

కన్నవారికి తీరని పుత్రశోకం   

నెలమంగల తాలూకా ఇస్లాంపురలో మహమ్మద్‌ ఖలందర్‌ ఇంటికెళ్తే తుపాకీ, పోలీస్‌ యూనిఫాంలో ఉన్న యువకుని ఫోటో, కట్టలకొద్దీ పాత ఉత్తరాలు కనిపిస్తాయి. ఇద్దరు వృద్ధ దంపతులు దీనంగా తమ కొడుకు ఆచూకీ చెప్పడానికి వచ్చారేమో.. అని చూస్తారు. వారు అలా ఎదురుచూడని రోజంటూ లేదు. ఒకటీ రెండు రోజులు కాదు.. ఏకంగా 25 ఏళ్ల నుంచి తప్పిపోయిన చెట్టంత కొడుకు కోసం నిరీక్షిస్తున్నారు. అలాగని అతడు మామూలు వ్యక్తి కూడా కాదు, సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆ పండుటాకులు తెలిపారు.  

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: దేశసేవ చేస్తానని వెళ్లిన కుమారుడు అదృశ్యమైపోయాడు. కన్నబిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు ఆనాటి నుంచి కన్నీరు పెట్టని రోజు లేదు. వెతికి పెట్టాలని పై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది. ఇలా ఎదురుచూసి ఎదురుచూసి పాతికేళ్లు గడిచిపోయాయి. బెంగళూరు సమీపంలో నెలమంగల తాలూకా ఇస్లాంపురం గ్రామం నివాసులైన  మహమ్మద్‌ ఖలందర్, మెహరున్నిసా దంపతుల దీనగాథ ఇది. 

నాగాల్యాండ్‌లో అదృశ్యం  
వివరాలు.. వారి కుమారుడు మహమ్మద్‌ రఫి పాతికేళ్లుగా అనూహ్యంగా కనబడకుండాపోయిన జవాన్‌. మహమ్మద్‌రఫి 1990లో సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగంలో చేరాడు. 117 బెటాలియన్‌లో భాగంగా రాజస్థాన్‌ , పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో నాలుగేళ్లు పనిచేశాడు. 1994లో నాగాల్యాండ్‌లో పనిచేస్తూ కనబడకుండాపోయాడు. ఆనాటి నుంచి కు మారుని గురించి ఎటువంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులకు, కమాండర్‌లకు ఫిర్యాదుచేసినా ఏం లాభం లేకుండాపోయిందని వృద్ధ దంపతులు బోరుమంటున్నారు. ఉగ్రవాదుల దాడి జరిగి జవాన్‌లు మరణించిన ప్రతిసారీ ఆ తల్లితండ్రులు కన్నబిడ్డను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు. కనీసం తమ బిడ్డ బ్రతికున్నాడో లేడో అనే సమాచారమైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. తమ బిడ్డ డ్యూటీలో ఉండగా రాసిన ఉత్తరాలను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు.          

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు