జైలు ... కరెన్సీ ... విదేశాలకు పెళ్లాంతో పరారీ

14 Dec, 2014 10:52 IST|Sakshi
జైలు ... కరెన్సీ ... విదేశాలకు పెళ్లాంతో పరారీ

చెన్నై : కరెన్సీని ఎరవేస్తే చాలు కటకటాల నుంచి విముక్తి పొందవచ్చని నిరూపించాడో యావజ్జీవ ఖైదీ. కాపలా పోలీసులకు రూ.40 లక్షలు లంచం ఇచ్చి భార్యతో సహా విదేశాలకు చెక్కేశాడు. కడలూరు జిల్లా బన్‌రుట్టీ తాలూకాకు చెందిన తవమణి (30) ఒక హత్య కేసు, పూణేలో మరో హత్య కేసులో నిందితుడిగా, గ్రూప్ 2 ప్రశ్నపత్రాల లీకు కేసులో ఖైదీగా అక్కడి జిల్లా జైలులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు. కడలూరు జైలులో ఉన్నపుడు ఊచలు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని తిరుచ్చి సెంట్రల్ జైలుకు మార్చారు.
 
పూణే కేసు విషయమై అక్కడి కోర్టులో హాజరుపరిచేందుకు గత నెల 24న రైలులో తీసుకెళుతుండగా తవమణి తప్పించుకున్నాడు. దీంతో సాయుధదళానికి చెందిన ఎస్‌ఐ ఇళంగోవన్ తదితర ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు. తప్పించుకున్న తవమణి కోసం గాలింపు జరుపుతుండగా ప్రకాష్, మణికంఠన్ అనే పేరుమోసిన రౌడీలు పట్టుపడ్డారు.
 
 తవమణి తప్పించుకోలేదని, తిరుచ్చి పోలీసులు రూ.40లక్షలు లంచం తీసుకుని తాముగా విడిచిపెట్టారని ఆ రౌడీ షీటర్లు చెప్పారు. తవమణి వద్ద రూ.200 కోట్ల నగదు ఉందని, భార్యతో సహా విదేశాలకు వెళ్లిపోయాడని చెప్పారు. 

మరిన్ని వార్తలు