బెంగళూరు ప్రశాంతం

15 Sep, 2016 06:11 IST|Sakshi
బెంగళూరు ప్రశాంతం

కర్ఫ్యూ తొలగింపు
- 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్న ప్రభుత్వం
- పోలీసుల అదుపులో 350 మంది.. రేపు తమిళనాడు బంద్
 
 సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై హింస చెలరేగిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన కర్ఫ్యూను బుధవారం ఉదయం 9 గంటలకు ఎత్తివేశారు. అంతకుముందు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ సున్నిత ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్లు అంచనా వేసి కర్ఫ్యూను ఎత్తివేశారు.  అయితే.. ముందుజాగ్రత్తగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పరమేశ్వర చెప్పారు. హింసకు సంబంధించి 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.  బీఎంటీసీ బస్సులు, ట్యాక్సీలు, మెట్రో సర్వీసులు పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కావడంతో పాటు వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలను తెరవడంతో బెంగళూరులో జనజీవనం మామూలు స్థితికి చేరుకుంది. అన్ని ఐటీ, బీపీఓ కంపెనీల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయటంపై కర్ణాటకలో కొనసాగుతున్న ఆందోళనలు.. ఈ నెల 12న హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.    

 మండ్యాలో తమిళుల నిరసన...
 కావేరి జలాల విడుదలపై ఆందోళనలకు కేంద్ర బిందువైన మండ్య నగరంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలను నిరసిస్తూ తమిళులు ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను నిరసిస్తూ గురువారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రైలోరోకోలకు కన్నడచళువళి వాటాల్ పార్టీతో పాటు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.   మరోపక్క..  తమిళనాడులోని పలు వాణిజ్య, రైతు సంఘాలు ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు.. డీఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

 సుప్రీంను ఒప్పించేందుకు యత్నిస్తాం
 కావేరి జలాల విషయంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై, కావేరి బేసిన్‌లో ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలపై సుప్రీంకోర్టును ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడుకు నీటి విడుదలకు సంబంధించిన కేసు ఈ నెల 20న విచారణకు వచ్చినపుడు.. కావేరి బేసిన్‌లో నీటి సమస్య ఎదుర్కొంటున్నామని, తాగు అవసరాలకు మాత్రమే నీరు మిగిలివుందని వివరిస్తామని  జలవనరుల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ చెప్పారు. తమిళనాడు, కర్ణాటకల్లో శాంతిభద్రతలను నెలకొల్పేలా ఆ రెండు రాష్ట్రాలకు, కేంద్రానికి నిర్దేశించాలంటూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

మరిన్ని వార్తలు