కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు

20 Nov, 2016 02:42 IST|Sakshi
కాంచీపురం: పది రోజులు దాటుతున్నా.. కరెన్సీ కష్టాలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాత నోట్లు చెలామణి కాకపోవడంతో పాటు బ్యాంకుల్లో సైతం అతి తక్కువ మాత్రమే పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ముందుగా అనుకున్న పనులను ప్రారంభించలేక నానా అవస్థలు పడుతున్నారు. నల్లధనం, నకిలీ డబ్బు ఏరివేసేందుకు రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇలా ప్రకటించి పది రోజులు దాటుతున్నా కరెన్సీ మాత్రం పూర్తి స్థాయితో జనానికి అందుబాటులోకి రాలేదు.
 
  అందుబాటులోకి వచ్చినా కేవలం రూ. రెండు వేలు మాత్రమే పొందాలనే షరతు పెట్టడంతో సాధారణ ప్రజలకు మరిన్ని కష్టాలు పడుతున్నారు. దీంతో బ్యాంకుల ముందు వందలాది మంది ప్రతిరోజూ క్యూకడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు ఊరటగా వివాహ శుభకార్యాలు పెట్టుకున్న వారు తమ ఖాతాల నుంచి రూ. 2.50 లక్షలను పొందవచ్చని తీసుకున్న నిర్ణయం కొంత ఊరట కలిగించింది. ఈ క్రమంలో వివాహ ఖర్చుల కోసం బ్యాంకును ఆశ్రయించిన వారికి కాంచీపురంలో రూ. 2.50 లక్షలను బ్యాంకు సిబ్బంది అందజేశారు. ఇక బ్యాంకుల వద్ద ఏర్పడుతున్న రద్దీతో సీనియర్ సిటిజన్‌‌స పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. 
 
 సామన్యుల్లాగా క్యూల్లో ఎక్కువసేపు నిలబడలేక వారు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక గంటల తరబడి వేచి ఉన్నా కూడా కేవలం రూ. రెండు వేలు మాత్రమే అందిస్తుండడంతో అనేక మంది నిరాశతో బ్యాంకుల నుంచి వెనుదిరుగుతున్నారు. ఇదిలాఉండగా నోట్ల రూపంలో ఉన్న పర్సులు కాంచీపురంలోని దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని కొనేందుకు యువత ఉత్సాహం చూపుతోంది.  
మరిన్ని వార్తలు