కరెంట్‌ కష్టాలు

15 Dec, 2016 02:33 IST|Sakshi

సాక్షి, చెన్నై: వర్దా తీరం దాటి రెండు రోజులు అవుతోంది. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా పవర్‌ కష్టాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతా లు, శివారుల్లోని అన్నీ ప్రాంతాలు మూడో రోజు బుధవారం కూడా అంధకారం లో మునిగాయి. తాగు నీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. మందకొడిగా శివార్లలో సాగుతున్న సహాయ క చర్యలతో ప్రజల్లో తిరుగుబాటు బయలు దేరిం ది. దీంతో ఆగమేఘాలపై కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో , చెన్నై శివార్లలోని ప్రాంతాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృం దాన్ని సీఎం పన్నీరుసెల్వం రంగంలోకి దింపారు. వర్దా సృష్టించిన విలయ తాండవం నుంచి చెన్నై నగరంలో కొన్ని ప్రాంతాలు మినహా తక్కినవన్నీ కోలుకుంటున్నాయి.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పర్వం క్రమంగా సాగుతోంది. డెబ్బై శాతం మేరకు చెన్నైలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడంతో, ఇక్కడి ప్రజలకు కొంత ఊరటే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో పది వేల మంది వరకు ఉన్నారు. వీరికి అన్ని రకాల వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నారు. ఇక,  నగరంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కష్టాలు వెంటాడుతున్నా, శివార్లలో మాత్రం జనం పాట్లు వర్ణణాతీతం. ఉత్తర చెన్నై పరిధిలోని మీంజూరు, తిరువొత్తియూరు, కొడుంగయూరు, మధురాంతకం, మూలకడై, మాధవరం పరిసరాల్లో దక్షిణ చెన్నై పరిధిలో ఈసీఆర్, ఓఎంఆర్‌ పరిసరాలు, నారాయణ పురం, పళ్లికరణై, వేళచ్చేరి, మేడవాక్కం, సంతోపురం, వేంగై వాసల్, అగరం, షోళింగనల్లూరు, నావలూరు, తాంబరం, పెరుంగళత్తూరు, ముడిచ్చూరు, మణివాక్కం ప్రాంతాల్లో  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది.

తిరుగుబాటు :  కాంచీపురం, తిరువళ్లూరు నగరాల్లో ఆగమేఘాల మీద సహాయక చర్యలు సాగుతున్నా, శివారు గ్రామాల్లో పరిస్థితి దారుణం. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు శివార్లలోకి ఇంత వరకు ఏ ఒక్క అధికారి అటు వైపుగా తొంగి చూడలేదని చెప్పవచ్చు. విరిగిన కొమ్మల్ని, నేలకొరిగిన చెట్లను స్థానికులే తొలగించుకోవాల్సిన పరిస్థితి. విరిగి పడ్డ స్తంభాలు, తెగిన తీగలు రోడ్ల మీదే పడి ఉండడం బట్టి చూస్తే,  సహాయక చర్యలు ముందుకు సాగడంలేదన్నది స్పష్టం అవుతోంది. మూడు రోజులుగా శివారు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నా, వెలుగు నింపే వాళ్లే లేరు. మరో వారం రోజులు పడుతుందేమో అన్నట్టుగా పరిస్థితులు శివార్లలో నెలకొని ఉన్నాయి. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీళ్లు కరువయ్యాయి. తాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. తమను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధి, చెన్నై మహానగర శివారు ప్రాంత వాసులు తీవ్ర ఆక్రోశంతో రగులుతున్నారు.

 పాల ప్యాకెట్లు, తాగు నీటి కష్టాలు బుధవారం మరింత జఠిలం కావడం, ధరలు పెరగడం వెరసి పాలకుల తీరుపై ప్రజలు తిరుగ బడే పనిలో పడ్డారు. పాల ప్యాకెట్ల ధరలు రెట్టింపయ్యాయి. 20 లీటర్ల తాగు నీరు రూ.యాభై వరకు ధర పలకగా, ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్లు బిందె నీళ్లు రూ. 20 అని డిమాండ్‌ చేయడం వెరసి ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహావేశాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల జనం రోడ్డెక్కారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ముట్టడించారు. అక్కడ సమాధానాలు ఇచ్చే వాళ్లే లేని దృష్ట్యా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారంలో మునిగిన ప్రాంతాల్లో వెలుగు కోసం కొవ్వొత్తుల కొనుగోళ్లు పెరిగాయి. కొవ్వొత్తుల కొరత సైతం నెలకొనడంతో, రాత్రుల్లో ఎక్కడ దొంగల స్వైర విహారానికి తాము గురి కావాల్సి ఉంటుందో నన్న బెంగతో బిక్కుబిక్కు మంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. నీటి నిల్వ, పేరుకుపోయిన చెట్ల చెత్తా చెదారాలతో ఎక్కడ రోగాలు ప్రబలుతాయోనన్న ఆందోళన మరో వైపు నెలకొంది. ఇక, సమాచార వ్యవస్థ ఇంకా పునరుద్ధరించని దృష్ట్యా, ఆ కష్టాలు మరో వైపు. కాగా, రాత్రుల్లో  ఆకాశంలో వెన్నెల వెలుగు ప్రకాశ వంతంగా ఉండడం శివారు వాసులకు కాస్త ఊరట.

మంత్రుల పరుగు : శివారుల్లో ప్రజల్లో ఆక్రోశం రగలడంతో సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం అయ్యారు. మంత్రుల బృందాల్ని రంగంలోకి దించారు. చెన్నైలో సీఎం పన్నీరు సెల్వంతో పాటు ఐదుగురు మంత్రుల బృందం సహాయక చర్యల పర్యవేక్షణలో మునిగాయి. చెన్నై పరిధిలోకి వచ్చే తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల పరిధిలోని ప్రాంతాలు, ఆ రెండు జిల్లాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృందాల్ని పంపించారు. ఆ మేరకు కాంచీపురం కేసీ వీరమణి, సెల్లూరు రాజు, సరోజ, కేటీ రాజేంద్ర బాలాజీ, ఓఎస్‌ మణియన్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు  మంత్రి కామరాజ్, పొన్నేరి విజయభాస్కర్, పలవేర్కాడు  అన్భళగన్, పాండియరాజన్, గుమ్మిడి పూండి  బెంజిమిన్, చోళవరం వేలుమణి తిష్ట వేసి సహాయక చర్యలు వేగవంతం చేసే పనిలో పడ్డారు.ఇక, శివారుల్లోకి 150 మొబైల్‌ వైద్య బృందాల్ని పంపించింది, శిబిరాల ఏర్పాటుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

మళ్లీ వాన భయం... నేటి నుంచి స్కూళ్లు : వర్దా తాండవం నుంచి ఇంకా జనం పెద్దగా తేరుకోలేదు. శివారుల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ సమయంలో మళ్లీ వాన భయం జనంలో మొదలైంది. వర్దా బలహీన పడి కర్ణాటక వైపుగా వెళ్లినా, ఆ ప్రభావం మేరకు రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, చెన్నైకు మరో వాన గండం తప్పదన్నట్టుగా వాట్సాప్‌ , సోషల్‌ మీడియాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక, గురువారం నుంచి చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లను తెరిచేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 

మరిన్ని వార్తలు