చట్టాలకు పదును పెట్టాలి

13 Jun, 2014 02:53 IST|Sakshi
చట్టాలకు పదును పెట్టాలి

సాక్షి, బెంగళూరు :  రాష్ర్టంలో బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదను పెట్టాల్సిన అవసరం ఉందని, అలాగే నూతన చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కంఠీరవ స్టేడియం గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం చట్టంలో ఉన్న లొసుగుల వల్ల బాల కార్మిక వ్యవస్థను అరికట్టలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా 2017 నాటికి రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని అధికారులకు
 సూచించారు.

అనంరతం ప్రభుత్వ వసతి గృహల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న పలువురు చిన్నారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అందజేశారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కెంపయ్యకు రాష్ట్ర నిఘా విభాగం సలహాదారుగా నియమించనున్నట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదన్నారు.
 
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడి ఫ్రీడం పార్కు నుంచి కంఠీరవ స్టేడియం వరకూ రాష్ట్ర కార్మికశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘వాకథాన్’ నిర్వహించింది. ఇందులో మంత్రి పరమేశ్వర్ నాయక్‌తో పాటు గతంలో బాలకార్మికులుగా ఉంటూ ప్రస్తుతం వివిధ ప్రభుత్వ వసతి పాఠశాలల్లో  చదువుకుంటున్న చిన్నారులు, ఎమ్మెల్సీ, శాండిల్‌వుడ్ నటి తారతో పాటు పలువురు సామాజిక వేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన డోలు కుణిత, బాల కార్మిక వ్యవస్థను నిరసిస్తూ వేసిన చిత్రాలు ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు