మళ్లీ అమ్మేనా !

6 Mar, 2016 08:53 IST|Sakshi
మళ్లీ అమ్మేనా !

అన్నాడీఎంకేకు 116
డీఎంకేకు 101
సీ ఓటర్స్ సంస్థ సర్వేలో వెల్లడి

 
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేకు ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారా ? సీఎంగా అమ్మకే మళ్లీ అవకాశం ఇవ్వనున్నారా? అవుననే అంటున్నాయి. ఇండియా టీవీ కోసం సీ ఓటర్స్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు.
 
చెన్నై : ఎన్నికలు వచ్చాయంటే చాలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారోననే సర్వత్రా ఉత్కంఠ సహజం. అందునా ప్రాంతీయ పార్టీలదే పెత్తనంగా సాగుతున్న తమిళనాడులో ఎందరో నేతలు మరెన్నో ప్రాంతీయ పార్టీలు. గత ఐదు దశాబ్దాలకు పైగా అన్నాడీఎంకే, డీఎంకేలే రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. ఆయా పార్టీల వెంట నడిచే పార్టీలు ఎన్ని ఉన్నా ముఖ్యమంత్రి పీఠం మాత్రం ఈ రెండు పార్టీల అధినేతలకే. బిడ్డ పుడితే అయితే ఆడ లేకుంటే మగ అన్నట్లుగా జయలలిత లేదా కరుణానిధి సీఎం కావడం ఖాయమని చిన్నవాళ్లను అడిగినా ఇట్టే చెబుతారు.
 
అయితే ఈసారి ఎన్నికలు కొద్దిగా భిన్నం. సీఎం సీటు కోసం జయలలిత, కరుణానిధి, అన్బుమణి రాందాస్ (పీఎంకే), విజయకాంత్ (డీఎండీకే) ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ పొత్తులు పూర్తయితే మరెంత మంది ముఖ్యమంత్రుల అభ్యర్థులు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. రాజకీయ ఉత్కంఠల నుంచి ప్రజలకు ఒకింత ఉపశమనం కలిగించేందుకో ఏమో ఇండియా టీవీ ఇటీవల ఒక సర్వే
 నిర్వహించింది.
 
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అత్యధిక స్థానాలు అన్నాడీఎంకే, డీఎంకేలకు లభిస్తాయని సర్వే చెబుతోంది. అయితే స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం చేపట్టే స్థాయిలో ఇరుపార్టీలకు సీట్లు రావంటూ గుబులు రాజేసింది. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. అన్నాడీఎం 116, డీఎంకే 101 స్థానాలను గెలుచుకుంటుంది.

మిగిలిన 18 స్థానాలను ఇతర పార్టీలు పంచుకుంటాయి. ప్రస్తుత అసెంబ్లీలో అన్నాడీఎంకే 150 స్థానాలు, కూటమి పార్టీలను కలుపుకుని 203 సభ్యులతో బలంగా ఉంది. డీఎంకే కేవలం 23, మిత్ర పక్షాలను కలుపుకుని 31 అసెంబ్లీ స్థానాలతో బలహీనంగా ఉంది. సర్వే సమాచారం ఇలా ఉండగా అసలు ఫలితాలు ఆ సర్వేశ్వరుడికే ఎరుక.

>
మరిన్ని వార్తలు