ప్రపంచీకరణతో ప్రాంతీయభాషలకు ముప్పు

23 Feb, 2014 00:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రాంతీయభాషలు అంతరించే ప్రమాదం ఉందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు విరాహత్ అలీ వ్యాఖ్యానించారు. వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం  నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో అలీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
 
 భాష అంటే పరస్పర భావోద్వేగాలను పంచుకునే సాధనం మాత్రమే కాదని, ఒక జాతికి గుర్తింపు అని చెప్పారు. భాషను పొగొట్టుకున్న జాతులేవీ చరిత్రలో నిలిచిలేవని, అందుకే ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషలో పట్టు సాధించినట్లయితేనే వ్యక్తిత్వ వికాసం పెరుగుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాతృభాష పరిరక్షణ విషయమై పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, కార్యాధ్యక్షుడు చింతకింది ఆనందం, ట్రస్టీ చైర్మన్ మంతెన రమేష్, సభ్యులు బోగా సహదేవ్ తదితరులు ప్రసంగించారు. కాగా, కార్పొరేషన్ ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న కుంట మల్లేశం గౌరవ అతిథిగా పాల్గొనగా, వేముల మనోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 
 

>
మరిన్ని వార్తలు