విపక్షాలదే పై చేయి...

28 Apr, 2015 02:03 IST|Sakshi

బీబీఎంపీ విభజన బిల్లు
సెలెక్ట్ కమిటీ చేతికి సమావేశాల పేరుతో రూ. 3 కోట్లు ప్రజాధనం వృధా

 
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) విభజన విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లదే పై చేయిగా నిలించింది. ప్రత్యేక శాసన సభా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ  ‘విభజన’ కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేక శాసనసభల్లో భాగంగా మూడోరోజైన సోమవారం కూడా శాసనపరిషత్‌లో బీబీఎంపీ విభజన కోసం ప్రవేశపెట్టిన ‘కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) విభజన (సవరణ) బిల్లు-2015’ పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అధికార, విపక్షాలు విభజన బిల్లు పై చర్చించాయి. మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ...‘బెంగళూరు నగరాన్ని విభజించడం వల్ల కన్నడిగుల మధ్య ప్రాంతీయ భేదాలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా విభజన ముసాయిదా బిల్లు పై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. అందువల్ల బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగించాల్సిందే’ అని పట్టుబట్టారు. ఇందుకు జేడీఎస్ సభ్యులు కూడా తమ మద్దతును తెలిపారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం విభజన బిల్లు అనుమతి కోసం పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాలకు ఎన్నిసార్లు సర్ధిచెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సాయంత్రం 6.15 గంటలకు విభజన బిల్లును సెలెక్ట్ కమిటీకు అప్పగిస్తూ మండలి అధ్యక్షుడు శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
 
మూడు నెలల ఆగాల్సిందే...


శాసనసభలో ఆమోదం పొందిన ఏదేని ముసాయిదా బిల్లు  శాసనమండలికి ఆమోదం కోసం వచ్చిన తర్వాత ఆ బిల్లు పై మరింత అధ్యయనం కోసం సెక్షన్ 116ను అనుసరించి సెలెక్ట్ కమిటీకు  అప్పగించే అధికారం శాసనమండలి అధ్యక్షుడికి ఉంది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు బీబీఎంపీ విభజన ముసాయిదా బిల్లు సెలెక్ట్ కమిటీ చేతికి అప్పగిస్తూ అధ్యక్షస్థానంలో ఉన్న శంకరమూర్తి నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం మండలిలో ఉన్న అధికార విపక్ష సభ్యుల సంఖ్యాబలాన్ని అనుసరించి సెలెక్ట్ కమిటీలోనూ విపక్షానిదే పై చేయిగా కనిపిస్తోంది. ఇరుపక్షాల ప్రస్తుత బలాబలాను అనుసరించి బీజేపీ,కాంగ్రెస్ పార్టీకు చెందిన చెరి నలుగురు సభ్యులు, జేడీఎస్‌కు చెందిన ఒక ఎమ్మెల్సీను సెలెక్ట్ కమిటీ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. ఈ కమిటీకు రాష్ట్ర న్యాయ,పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి, లేదా ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ మూడు నెలల్లోపు తన నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నివేదికను మండలి ముందు తీసుకురాలేకపోతే  ముసాయిదా బిల్లు తిరిగి శాసనసభకు వెళ్లి అక్కడ నేరుగా ఆమోదం పొంది అనుమతి కోసం గవర్నర్‌కు వద్దకు వెళ్లనుంది.
 
 సెలెక్ట్ కమిటీలో


విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువ...
మండలిలోని మొత్తం సభ్యులు     75
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు      28
బీజేపీ పార్టీ ఎమ్మెల్సీలు         30
జేడీఎస్ ఎమ్మెల్సీలు         12
స్వతంత్రులు        4
చైర్మన్             1
 
 ప్రభుత్వ మొండిపట్టుకు రూ.3 కోట్లు వృధా


అధికార కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల మూడు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీఎంపీ విభజన బిల్లు అమోదం కోసమే మూడు రోజుల పాటు ప్రత్యేక శాసనసభ సమావేశాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, విద్యుత్, భద్రతా తదితర విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక్క రోజు చట్టసభలు నిర్వహించడానికి రూ.1 కోటి ఖర్చవుతోంది. దీంతో మూడు రోజులకు గాను దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చయినా విభజన బిల్లు చట్టసభల్లో పూర్తిస్థాయిగా ఆమోదం పొందకపోవడంతో దాదాపు రూ.3 కోట్లు ఖర్చయినట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు