గర్భం ధరించకుండానే ప్రసవించినట్లు నాటకం

23 Jun, 2017 06:27 IST|Sakshi
గర్భం ధరించకుండానే ప్రసవించినట్లు నాటకం

సినీ ఫక్కీలో భార్య మోసం
 భర్త ఫిర్యాదుతో వెలుగులోకి

కేకేనగర్‌: ఓ యువతి గర్భం ధరించకుండా బిడ్డకు జన్మనిచ్చినట్లు నాటకం ఆడడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువతి నుంచి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై, కీళ్పాక్కం రిటైర్డ్‌  సహాయ పోలీస్‌ కమిషనర్‌ సోమన్‌. ఇతని కుమారుడు యోగేశ్వరన్‌ భార్య పద్మిని.  2016, ఫిబ్రవరి 14న పెద్దల అనుమతితో వీరి వివాహం జరిగింది. అయితే పద్మినిని ఇష్టపడని యోగేశ్వరన్‌ తల్లిదండ్రులు తరచూ ఆమెను వరకట్న వేధింపులకు గురిచేసేవారని తెలుస్తోంది.

బిడ్డ పుడితే సమస్యలు తీరుతాయని బంధువులు చెప్పారు. దీంతో పద్మిని తాను గర్భవతినని భర్తతో చెప్పింది. అయితే ప్రతిసారి తల్లితోపాటు డాక్టర్‌ వద్దకు చెకప్‌కు వెళ్లేదని, భర్త పిలిస్తే వెళ్లేది కాదని తెలిసింది. ఆమెకు తొమ్మిదో నెల సీమంతం చేశారు. సీమంతానికి వచ్చిన పలువురు గర్భం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దానికి ఆమె తల్లి తమ వంశంలో అందరికీ ఇలాగే కడుపు ఉంటుందని నమ్మించింది. తర్వాత ఆమె ప్రసవం కోసం తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం తనకు ఆడ పిల్ల పుట్టిందని పద్మిని భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. బిడ్డను చూడడానికి వెళ్లిన యోగేశ్వరన్, అతని తల్లిదండ్రులకు బిడ్డ పుట్టి నాలుగు నెలలు అయినట్లు తెలిసింది.

దీంతో భార్య ప్రవర్తనపై సందేహంతో యోగేశ్వరన్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఇంకనూ శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పద్మిని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారి వద్ద విచారణ జరిపారు. బిడ్డ ఏ ఆసుపత్రిలో పుట్టింది, వాటి ఆధారాలు చూపించమని అధికారులు అడిగారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శిశువును తీసుకెళ్లారు. చింతాద్రిపేట పోలీసులు జరిపిన విచారణలో కొన్ని నిజాలు వెలుగుచూశాయి. పద్మిని తన 17 సవర్ల తాళి చెయిన్‌ను అమ్మి బిడ్డను ఉత్తరాది దంపతుల వద్ద కొన్నట్లు తెలిసింది. పిల్లల కోసం భర్త, అత్త వేధింపులు, తట్టుకోలేక ఈ పనిచేసినట్లు అంగీకరించింది.

మరిన్ని వార్తలు