ఉత్సవాలకు బందోబస్తు

8 Oct, 2013 00:33 IST|Sakshi

సాక్షి, ముంబై: నవరాత్రులను పురస్కరించుకుని దాండియా నృత్య వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా నగర పోలీసులు డేగ కన్ను వేశారు. ఆకతాయిల ఆటకట్టేందుకు పోలీసు శాఖకు చెందిన యాంటీ ఈవ్‌టీజింగ్ బృందాలను నియమించారు. ప్రస్తుతం వీరంతా నగరంతోపాటు పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో దాండియా ఉత్సవాలు జరుగుతున్న చోట మారువేషాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోరివలి, మలాడ్, ఘాట్కోపర్, ములుండ్ తదితర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాండియా, గర్భా నృత్య కార్యక్రమాలు ఏర్పాటుచే స్తారు. ఇక్కడ జన ం రద్దీ విపరీతంగా ఉంటుంది.
 
 ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మహిళలు పాల్గొనడంవల్ల ఈవ్‌టీజింగ్ లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం, చోరీలు లాంటి ఘటనలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా నియమించిన పోలీసులు నిఘా వేశారు. అందుకు అవసరమైన అదనపు పోలీసు బలగాలను కూడా తెప్పించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసుల వారాంతపు సెలవులు రద్దు చేశారు.
 
 గణేశ్ ఉత్సవాల కారణంగా దాదాపు 25 రోజులపాటు పోలీసులు, అధికారుల వారాంతపు, దీర్ఘకాలిక సెలవులను హోం శాఖ రద్దుచేసింది. ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులకు ఇటీవలే విశ్రాంతి లభించింది. కాని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో మళ్లీ వారాంతపు సెలవులు రద్దయ్యాయి. దాదాపు 20 వేల మంది పోలీసులు నగర రహదారులపై గస్తీ నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా క్విక్ రెస్పాన్స్ టీం మూడు బెటాలియన్లు, హోం గార్డులు, స్టేట్ రిజర్వుడు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ముంబై పోలీసు దళానికి చెందిన ప్రతినిధి, డిప్యూటీ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌదరి చెప్పారు. కాగా భారీగా దాండియా కార్యక్రమం ఏర్పాటుచేసే నిర్వాహకులు సాధ్యమైనన్ని సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని పోలీసులు అదేశించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆకతాయిలు లోపలికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

మరిన్ని వార్తలు