ముండే అమర్ రహే..!

4 Jun, 2014 22:50 IST|Sakshi
ముండే అమర్ రహే..!

సాక్షి, ముంబై: ‘మహా’నేత గోపీనాథ్ ముండే మరణంతో శోకసంద్రమైన రాష్ట్రం బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీడ్ జిల్లా, పర్లీ గ్రామానికి తరలివచ్చింది. ‘ముండే అమర్ రహే’ అంటూ ఆయన మద్దతుదారులు చేసిన నినాదాలతో పర్లీ గ్రామం మార్మోగింది. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ తదితర అన్ని ప్రాంతాలనుంచి వేలాదిగా ముండే అభిమానులు తరలిరావడంతో పర్లీ గ్రామం జనసంద్రమైంది. కేవలం పర్లి గ్రామంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకాల్లోని బీజేపీ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు ముండే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ మౌనం పాటించారు.

 అధికార లాంఛనాలతో అంత్యక్రియలు...
 వేలాదిమంది అభిమానుల సమక్షంలో గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పర్లీ గ్రామంలో అధికార లాంఛనాలతో జరిగాయి. ఆయన పెద్దకూతురు పంకజ, ముండే చితికి నిప్పంటించారు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు, ప్రమోద్ మహాజన్ కుటుంబ సభ్యులు ముండే కుటుంబ సభ్యులతోపాటే ఉన్నారు.

 పూర్ణా బంగ్లాలో ప్రముఖుల నివాళులు...
 వర్లీలోని సీ-ఫేస్ ప్రాంతంలోగల పూర్లా బంగ్లాకు మంగళవారం రాత్రంతా ప్రముఖులు తరలి వచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి 7.30 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకున్న ముండే మృతదేహాన్ని నారిమన్ పాయింట్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో నగరవాసులతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చి ముండే భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. అర్ధరాత్రి వరకు ప్రముఖుల రాక కొనసాగింది. ఆ తర్వాత బుధవారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో ముండే భౌతికకాయాన్ని లాతూర్‌కు తరలించారు.  

 పర్లీ బయలుదేరిన ముండే భౌతికకాయం...
 సుమారు 7.30 గంటలకు లాతూర్ విమానాశ్రయానికి ముండే భౌతికకాయం చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బీడ్ జిల్లా పర్లీ గ్రామానికి తరలించారు. అప్పటికే వేలాది మంది గ్రామస్తులు, సన్నిహితులు, అభిమానులు తమ ప్రియతమ నాయకుని కడసారి చూసేందుకు బారులు తీరారు. దుఃఖంతో మంగళవారం రోజంతా భోజనం లేకుండా, రాత్రంతా జాగారం చేసిన గ్రామస్తులు ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా పర్లి గ్రామం ‘ముండే అమర్ రహే’ అంటూ నినాదాలతో మార్మోగింది. శవ పేటిక గ్రామానికి చేరుకోగానే వారి రోదనలు మిన్నంటాయి.

తమ నాయకున్ని కడసారి తనివితీరా చూసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. భారీగా జనం రావడంతో అక్కడ తోపులాట జరిగింది.
వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. పక్కకు తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రామంలో ర్యాలీగా బయలుదేరిన అంతిమయాత్ర ఎంతసేపటికీ ముందుకు కదలలేదు. ముండే భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అంబులెన్స్ ముందు జనం అడ్డుపడడంతో చివరకు దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ జోక్యం చేసుకొని పక్కకు తప్పుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. సంయమనం పాటించాలని పోలీసులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో అంతిమ యాత్ర మెల్లమెల్లగా ముందుకు కదిలింది.

 అంత్యక్రియలకు ఏర్పాట్లు..
 ముండే అంత్యక్రియలు పర్లీ గ్రామంలోని వైద్యనాథ్ సహకార చక్కెర కర్మాగార మైదానంలో జరిగాయి. అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు తెలియగానే మంగళవారం ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ప్రముఖుల కోసం, సామాన్య జనం కోసం వేర్వేరుగా స్థలం కేటాయించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. చితిని పేర్చేందుకు ప్రత్యేకంగా గద్దె నిర్మించారు. మధ్యాహ్నం రెండు గంటలకు బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య ముండే బౌతికకాయానికి కూతురు పంకక నిప్పంటించారు.

 అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు...
 బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావ్దేకర్, రావ్‌సాహెబ్ దనవే, కిరీట్ సోమయ్య, రాజీవ్ ప్రతాప్ రుడి, ఉదయన్ రాజే బోంస్లే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఉద్ధవ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే, జితేంద్ర అవ్హాడ్, రాందాస్ ఆఠవలే, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికార్, రాష్ట్రానికి చెందిన 127 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 మంత్రుల ఘెరావ్..
 అంత్యక్రియలకు హాజరైన హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్, మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వాహనాలను ప్రజలు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ పక్కకు తప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన జనం ఉరుకులు పరుగులు తీశారు. బారికేడ్లు చెల్లాచెదురయ్యాయి. ఆగ్రహానికి గురైన జనం అక్కడున్న ఓ నాయకుని వాహనాన్ని బోల్తాపడేసి నిప్పంటించారు. దీంతో కొద్ది సేపు ఆ ప్రాంతమంత రణరణంగా మారింది. ముండే ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హర్షవర్ధన్ పాటిల్, మరికొందరు మంత్రులు కలుగజేసుకుని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు, ఆయన అభిమానులు శాంతించారు. ప్రమాదంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలంటే అందుకు సీబీఐ ద్వారా ఈ కేసు దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉద్ధవ్ ఠాక్రే కూడా అభిప్రాయపడ్డారు.

 నివాళులర్పించిన డబ్బావాలు..
 నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి ఉద్యోగుల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లను చేరవేస్తున్న డబ్బావాలాలు బుధవారం ఉదయం 11.30 గంటలకు లోయర్‌పరేల్ స్టేషన్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించి ముండేకు శ్రద్ధాంజలి ఘటించారు.
 

మరిన్ని వార్తలు