కూతురి అతితెలివి

7 Jan, 2019 12:47 IST|Sakshi

తల్లికి మాయమాటలు చెప్పి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన వైనం

భార్యను రప్పించాలని కోర్టును ఆశ్రయించిన భర్త

కర్ణాటక , కృష్ణరాజపురం : జీవిత చరమాకంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా చూడాల్సిన బాధ్యత పిల్లలది. అయితే ఇక్కడ ఓ కుమార్తె తన తల్లిని తన బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి నమ్మించి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన ఘటనపై ఇక్కడి కేఆర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.  మునియప్ప లేఔట్‌కు చెందిన కృష్ణకుమారి, మృత్యుంజయ దంపతులకు గీతామణి, వరుణ్‌ ఇద్దరు బిడ్డలు. గీతామణికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిపించగా ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారి పిల్లల బాగోగులను చూసుకోవడానికి ఆస్ట్రేలియా రావాలని తల్లిదండ్రులను కోరింది. ఇద్దరు నిరాకరించారు. మాయమాటలతో తల్లిని ఆరు నెలల క్రితం ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది. తిరిగి ఇండియాకు పంపించలేదు. తమిళనాడులో ఉంటున్న కుమారుడు వరుణ్‌ కూడా తండ్రిని నిర్లక్ష్యం చేయసాగాడు. దీంతో మృత్యుంజయ తన భార్యను ఇండియాకు రప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు