పేదలకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారు?

24 Aug, 2014 23:04 IST|Sakshi

 న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ నిర్మాణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద నగరంలోని నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం... ఢిల్లీ సర్కారును కోరింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను తెలియజేయాలంటూ కేంద్ర గృహ, పట్టణ దారిద్య్ర నిర్మూలన మంత్రిత్వ శాఖ ... ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొత్తం 67,784 ఫ్లాట్లను కేటాయించాల్సి ఉంది.
 
 ఇదిలాఉంచితే ఈ పథకం కింద ఇప్పటిదాకా నాలుగు వేలమందికే ఫ్లాట్లను కేటాయించామని ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా పంపించామన్నారు. అయితే నిరుపేదలకు కేటాయించిన ఫ్లాట్ల సంఖ్యను నిర్ధారించుకున్న తరువాతే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కేటాయింపుల సంఖ్య ఇంత స్వల్పంగా ఉండడానికిగల కారణమేమిటని ప్రశ్నించగా గుర్తింపే ప్రధాన  సమస్య అని ఆయన వివరించారు. అనేకమందిని గుర్తించామని అన్నారు. కాగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద ఢిల్లీ ప్రభుత్వం మొత్తం 67,784 ఫ్లాట్లను నిర్మించాల్సి ఉంది. అయితే అందులో తొమ్మిది వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.  
 
 సకాలంలో కేటాయింపు కష్టమే
 ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నగర పరిధిలోని రోహిణి ప్రాంతంలో చేపట్టిన ఫ్లాట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో లబ్ధిదారులకు ఫ్లాట్లను సకాలంలో కేటాయించే అవకాశాలు అంతంతగానే ఉన్నాయి. దీంతో వీరంతా మరికొంతకాలం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది. స్థానికుల అభ్యంతరాల కారణంగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనులపై విధించిన స్టేని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసినప్పటికీ స్థానికులు పనులను అనేక పర్యాయాలు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 18 వేల ఫ్లాట్లను డీడీఏ నిర్మించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒక రు మాట్లాడుతూ స్థానికులు దాడులకు పాల్పడుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విన్నవించామన్నారు.
 

మరిన్ని వార్తలు