ఎంసీడీసీ ‘డిమాండ్’పై కోర్టుకెక్కిన డీడీఏ

29 Oct, 2014 23:04 IST|Sakshi

న్యూఢిల్లీ: నగర పరిధిలోని నజుల్ భూముల నుంచి రూ. 530 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కార్పొరేషన్ డిమాండ్ నోటీసు జారీ చేయడంపై ఢిల్లీ అభివృద్ధి అథారిటీ(డీడీఏ) హైకోర్టును ఆశ్రయించింది. యూనియన్ ప్రభుత్వానికి చెందిన నజుల్ భూములను వివిధ అభివృద్ధి పనుల కోసం అప్పగిస్తారని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై జస్టిస్ బీడీ అహ్మద్, సిద్ధార్థ మ్రిదుల్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యాయవాది గిరిరాజు సుబ్రమణ్యం ద్వారా డీడీఏ హైకోర్టుకు పిటిషన్‌ను దాఖలు చేసింది.  వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి అప్పగించిన నజుల్ భూములపై రూ. 530 కోట్ల ఆస్తిపన్ను చెల్లించాలని అక్టోబర్ 20 వ తేదీన డీడీఏకు డిమాండ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు.
 
 యూనియన్‌కు చెందిన నజుల్ భూములకు డీడీఏ రక్షణకు మాత్రమే పరిమితమని, యాజమాన్యహక్కులేవీ బదిలీ కాలేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 285 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఆస్తిపన్నులో నజల్ భూములకు మినహాయింపు ఉందని,  భారత ప్రభుత్వానికి చెందిన నజల్ భూములకు డీడీఏ ఏజెంట్ మాత్రమేనని తెలిపారు.  రాజ్యాంగంలోని 285 ఆర్టికల్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ విధించే ఆస్తిపన్నులో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.  ఈ మేరకు ఎస్‌డీఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన డిమాండ్ నోటీసు ఏకపక్షంగా ఉన్నదని, దీనిపై తాత్కాలికంగా నిషేధించాలిన డీడీఏ న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. నజల్ భూములకు డీడీఏనే యజమాని అని మున్సిపల్ కార్పొరేషన్ దురభిప్రాయానికి వచ్చి డిమాండ్ నోటీసును జారీ చేసినట్లు డీడీఏ పిటిషన్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు