డీడీఏ అలసత్వంపై ఆగ్రహం

6 Jan, 2014 22:36 IST|Sakshi
2010లో నిర్మాణం చేపట్టిన అపార్టుమెంట్లను ఇప్పటికీ పూర్తి చేయని డీడీఏ, మూడు నెలల్లో పూర్తి డబ్బు చెల్లించాలని లబ్ధిదారులను ఆదేశించింది. గంగాబ్లాక్ వంటి గృహ సముదాయాల్లో అయితే కనీసం లిఫ్టులు, కరెంటు, నీటి సరఫరా వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు.
 
న్యూఢిల్లీ: సొంతింటి కోసం కలలు కంటున్న వారు ఢిల్లీ అభివృద్ధి ప్రాధికారసంస్థ (డీడీఏ) నిర్మిస్తున్న ఫ్లాట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే 2010లో డీడీఏ ఫ్లాట్లు దక్కించుకున్న వారి అనుభవాలను ఒక్కసారి పరిశీలిస్తే దరఖాస్తుదారులు గృహాలను స్వీకరించడానికి సుదీర్ఘకాలం నిరీక్షించకతప్పదని అర్ధమవుతుంది. వసంత్‌కుంజ్‌లోని డీ6లో నిర్మిస్తున్న గంగాబ్లాక్ అపార్టుమెంట్ నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని నిర్మాణం ఇది వరకే రెండేళ్లు ఆలస్యమైనా, ఇప్పటికీ అక్కడ ప్రహరీ గోడ, కరె ంటు, నీళ్ల సరఫరా వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదు. 
 
 కొన్ని ఇళ్లకైతే తలుపులు, కిటికీలను కూడా బిగించనేలేదు. గంగాబ్లాక్ ఫ్లాట్లను 485 మంది లబ్ధిదారులకు కేటాయిస్తూ డీడీఏ డిమాండ్ లెటర్లను పంపించింది. ఏళ్లు గడిచాక ఫ్లాట్లు తమ చేతికి వచ్చాయని, మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లోపు చెల్లించాల్సిందిగా ఆదేశించారని కరోల్‌బాగ్‌వాసి ఒకరు అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని, ఇప్పుడు మాత్రం అప్పు చేసి డీడీఏకు డబ్బు కడుతున్నామని దరఖాస్తుదారులు చెబుతున్నారు. జాప్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇంటి అద్దె, బ్యాంకు వడ్డీ..రెండూ చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ‘కొన్ని నెలల క్రితం గంగాబ్లాక్ ఫ్లాట్లను చూశాను. అక్కడ పైఅంతస్తులకు కనీసం మెట్లు, దిమ్మెలు లేవు. కరెంటు, నీటి సరఫరాకు ఎలాంటి ఏర్పాట్లూ కనిపించలేదు. పనులు ఇప్పుడిప్పుడే మొదలైనట్టు అనిపించింది’ అని ఈ కాంప్లెక్స్ ఫ్లాట్ దక్కించుకున్న రమేశ్ ప్రసాద్ అన్నారు.
 
 రమేశ్ మాదిరిగానే చాలా మంది తమ ఫ్లాట్లను చూసి ఆవేదనకు గురయ్యారు. చాలా వాటికి గోడలు, తలుపులు, కిటికీలు, కరెంటు, బాత్‌రూమ్ పరికరాలు లేవు. అవి ఎంతమాత్రమూ నివాసయోగ్యం కావని చెబుతున్నారు. లిఫ్టులు, కరెంటు లేకుండా ఎనిమిది అంతస్తుల భవనంలో నివ సించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘మరో రెండేళ్లు గడిచినా గంగాబ్లాక్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యేలా లేదు. నాకు ఉన్నతాదాయ వర్గాల (హెచ్‌ఐజీ) విభాగంలో  మూడు పడక గదుల ఫ్లాట్ కేటాయించారు. దీనిని స్వాధీనపర్చుకునే దాకా మేం ప్రతి నెలా ఆర్థికంగా నష్టపోతాం. ఎలాంటి సదుపాయాలూ కల్పించకుండానే.. నిర్వహణ ఖర్చులకంటూ ఇది వరకే రూ.ఆరు లక్షలు వసూలు చేశారు. ఇది పూర్తి కావడానికే ఏళ్లు పట్టేలా ఉంది. పూర్తిగా డబ్బు చెల్లించిన తరువాత కూడా డీడీఏ మాకు స్వాధీనపత్రాలు ఇవ్వాలంటే మరో ఆరు నెలలు పడుతుంది. డీడీఏ ఇలా మా జీవితాలతో ఆటలాడుకోవడం అన్యాయం’ అని నవీన్‌కుమార్ అనే లబ్ధిదారుడు వివరించారు. 
 
 ఫ్లాట్ల నిర్మాణంలో తీవ్రజాప్యంపై కొందరు విలేకరులు డీడీఏ అధికారులను ప్రశ్నించగా వింత సమాధానం వచ్చింది. ముందుగా తాము గంగాబ్లాక్‌కు వెళ్లి అంతా పరిశీలించాకే సమాధానం చెప్పడం వీలవుతుందంటూ తప్పించుకున్నారు. గంగ్లాబ్లాక్‌తోపాటు ముఖర్జీనగర్ కాంప్లెక్స్, వసంత్‌కుంజ్, రోహిణి, ద్వారక, మోతియాఖాన్, మోలార్‌బండ్ అపార్టుమెంట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. లక్కీడ్రాలో పేర్లు వచ్చిన వారందరికీ 2010లోనే ఫ్లాట్లు కేటాయించారు. ఈ ప్రాంతాల్లోని ఫ్లాట్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. 
 
>
మరిన్ని వార్తలు