శునకానికి పెద్దకర్మ

17 Oct, 2016 20:23 IST|Sakshi

శునకానికి పెదకర్మ నిర్వహించి దానిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కు చెందిన చిమట శ్రీనివాసరావు కుటుంబసభ్యులు. శ్రీనివాసరావు దంపతులకు పిల్లలు లేకపోవడంతో 10 ఏళ్ళ నుంచి ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి స్నూపి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. సంతానం లేకపోవడంతో స్నూపియే తమ బిడ్డగా భావించి కుటుంబ సభ్యునిగా ఆదరించారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన అనారోగ్యంతో శునకం మృతి చెందింది. స్నూపి మరణం వారిని ఎంతగానో కలచివేసింది. చనిపోయిన శునకానికి తమ ఇంటి ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించి, అందంగా టైల్స్‌తో సమాధిని నిర్మించారు. సోమవారంతో స్నూపి మరణించి 11 రోజులు కావడంతో పెద్దకర్మ నిర్వహించారు. కార్యక్రమానికి బంధువులను, రాజకీయ ప్రముఖులను, స్నేహితులను పిలిపించి విందు ఏర్పాటు చేశారు. స్నూపి చిత్రపటానికి మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీ కృష్ణప్రసాద్, న్యాయవాదులు జొన్ను శివరామ్, జింకా సురేష్‌కుమార్ యాదవ్, పసుపులేటి నాగయ్య, బొజ్జా నాగేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు