డిస్కంలకు బకాయిలు చెల్లించంq

8 May, 2015 23:46 IST|Sakshi
డిస్కంలకు బకాయిలు చెల్లించం

- మంత్రి సత్యేంద్ర జైన్
- బకాయిలను సబ్సిడీలతో సరిపెట్టాలని నిర్ణయం
- విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకూడదని ఆదేశం
న్యూఢిల్లీ:
పవర్ సబ్సీడీలో భాగంగా డిస్కంలకు డబ్బులు చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి సరఫరాలో డిస్కంలు చెల్లించాల్సిన మొత్తంతోనే సరిపెట్టాలని యోచిస్తోంది. బీఎస్‌ఈఎస్‌కు రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్), బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలను.. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సీడీలతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

రెండు డిస్కంలు ఢిల్లీ ట్రాన్స్‌కో లివిటెడ్‌కు సుమారు రూ. 6 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీకి ట్రాన్స్‌కో తిక్రీకాలన్ ప్రాంత ంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన భూగర్భ సరఫరా వ్యవస్థ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్‌లు చెల్లించాల్సిన బకాయిలపై సంప్రదించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదని మంత్రి పేర్కొన్నారు.

విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, తక్కువ మొత్తాలు వసూలు చేయడంతో బీఎస్‌ఈఎస్ రూ. 10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు. నెలలో 400 యూనిట్ల విద్యుత్ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం 50 శాతం సబ్సీడీ ఇస్తుందని హామీనిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేసవిలో విద్యుత్ కోతలపై డిస్కంలను మంత్రి హెచ్చరించారు. డిస్కంలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ సర ఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని ఆయన చెప్పారు. దీనిని సమర్థిస్తూ డిస్కంలు లిఖితపూర్వకంగా సెక్రటరీకి తెలిపాయని పేర్కొన్నారు. ఢిల్లీ ట్రాన్స్‌కో తిక్రీకాలన్‌లో 400కేవీ సబ్‌స్టేషన్‌తో కలిసే 200కేవీ సబ్‌స్టేషన్‌ను కలపడానికి పీరాఘరీలో కొత్తగా 200కేవీ సామర్థ్యం గల భూగర్భ స్టేషన్‌ను నిర్మించింది.

మరిన్ని వార్తలు