ఎన్నికల బరిలో దీప

4 Feb, 2017 09:03 IST|Sakshi
ఎన్నికల బరిలో దీప

►స్థానికానికి సై
► అర్కేనగర్‌ నుంచి పోటీకి సమాలోచన
► త్వరలో ఆర్కేనగర్‌ ఎన్నికల తేదీ ప్రకటన : ఈసీ


రాజకీయ రంగంలోకి ఒంటరిగా అడుగుపెట్టిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప ఎన్నికల రణరంగంలోకి సైతం దిగేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి అర్కేనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు సమాయత్తం అవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికైన నేపథ్యంలో ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోవడంతో దీప స్వతంత్రంగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీ, మంది మార్బలం ఏదీ లేకుండా తన రాజకీయ అరంగేట్రాన్ని ఇంటి వద్ద ప్రకటించారు. అయితే ఏదైనా పార్టీలో చేరుతారా, సొంత పార్టీ పెడతారా అనే సందేహాలకు ఈ నెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున దీప సమాధానం ఇవ్వనున్నారు. అయితే అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకోవడం, భవిష్య ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో దీప నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతి సందర్భంగా శుక్రవారం మెరీనాబీచ్‌లోని అన్నా సమాధి వద్దకు వచ్చి దీప నివాళులర్పించారు.

అన్నాదురై వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై తండయార్‌పేటలో వేదికను ఏర్పాటు చేసి దీప చేతుల మీదుగా ప్రజలకు సహాయకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వేదికను తొలగించాలని ఆదేశించడంతో గందరగోళం నెలకొంది. దీప అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం నిలిచిపోయింది. గురువారం రాత్రి దీప తన అభిమానులతో కలిసి మైలాపూర్‌లోని కపాలీశ్వర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వెలసిన దీప పేరవైలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది.

ఎన్నికల బరిలోకి... : ఆర్కేనగర్‌ నుంచి పోటీ చేసేందుకు అనుకూల,  ప్రతికూల అంశాలను సన్నిహితుల వద్ద ఆమె సమీక్షించుకుంటున్నారు. అన్నాడీఎంకేకు పెట్టని కోట, జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్‌ నుంచి పోటీచేయాలని ఆ పార్టీలోని అసంతృప్తి వాదులు దీపపై ఒత్తిడి పెంచుతుండగా, ఆమె కూడా సమ్మతించినట్లు సమాచారం. ఆర్కేనగర్‌లో ఎన్నికల తేదీని త్వరలో ఖరారు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్‌లఖాని శుక్రవారం తెలిపారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ నియోజయకవర్గంలో జూన్  5వ తేదీలోగా ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. మేలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా త్వరలో తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తిరునెల్వేలి జిల్లా దీప పేరవై ప్రకటించింది.

మరిన్ని వార్తలు