డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం

18 Jul, 2016 02:55 IST|Sakshi
డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం

తిరువళ్లూరు: మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ చేయడానికి స్థలం ఏర్పాటు చేయకపోవడంతో, ప్రభుత్వం ప్రకటించిన సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు అగమ్యగోచరంగా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీలో దాదాపు లక్ష మందికి పైగా నివాసం ఉంటున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు,  హోటల్స్‌తో పాటు ఇతర అవసరాల వల్ల ఏర్పడే చెత్తను మగ్గిన కుప్పలు, మగ్గని కుప్పలుగా వేరు చేసి తలకాంజేరీకి సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ చెత్తకుప్పలు గుట్టల్లా పేరుకుపోవడంతో సమీప ప్రాంతాలకు దుర్వాసన వస్తోంది.

చెత్తకుప్పలకు నిప్పు పెట్టినప్పుడు పొగలు దట్టంగా విస్తరించడం, హానికర వాయువులు వెలువడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో చెత్తను పడవేయడానికి కుత్తంబాక్కం సమీపంలో 110 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటుచేసి అక్కడ సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు.
 
డంపింగ్ యార్డుకు స్థలం కరువు:
తిరువళ్లూరులో సేకరించే చె త్తకుప్పలను డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కుత్తంబాక్కంలో స్థానికులు డంపింగ్‌యార్డు ఏర్పాటుకు నిరసన వ్యక్తం చేయడంతో ఎగువ నల్లాటూరు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో తిరువళ్లూరును పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వం ఆశయం  కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
 
ఎరువుల తయారీ పరిశ్రమకు నిధుల కొరత :  
తిరువళ్లూరు మున్సిపాలిటీ నుంచి భారీగా వెలువడుతున్న చెత్తవల్ల భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ నారావారికుప్పంతో పాటు 8 మేజర్ పంచాయతీల్లో జరుగుతోంది.  వాస్తవానికి సేంద్రియ ఎరువుల తయారీ ఖర్చులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాల్సి ఉంది. అయితే తిరువళ్లూరులో సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియ సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

ముప్పు నుంచి ఉపశమనం : ప్రస్తుతం తిరువళ్లూరులో సేకరించే చెత్తకుప్పలను తలకాంజేరి వద్ద డంపింగ్ చేస్తున్నారు. చెత్తకుప్పలు భారీగా పేరుకుపోతే నిప్పు పెట్టి కాల్చేస్తున్నారని, ఆ సమయంలో పొగలు దట్టంగా వ్యాపించడంతో పాటు హానికర వాయువులు వెలువడుతుండడంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన  చెందుతున్నారు.

మరిన్ని వార్తలు