కొత్త సభ్యుణ్ణి చేర్చుకో.. టికెట్ దక్కించుకో

21 Dec, 2014 23:50 IST|Sakshi

* అనుబంధ సంఘాల నాయకులకు పిలుపు
* పార్టీ బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ

న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ప్రచారం ఉధృతం చేయడంతోపాటు పార్టీలోకి కొత్త సభ్యులను చేర్పించడానికి బీజేపీ రాష్ర్టశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు పెంచేందుకు అనుబంధ సంఘాల సెల్స్‌ను సమాయత్తం చేస్తోంది. ‘పార్టీలో నూతనంగా సభ్యులను చేర్పించిన సెల్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్‌ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నాయకుడు వెల్లడించారు.
 
పార్టీ అనుబంధ సంఘాలివే..
యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, పూర్వాం చల్ మోర్చాలు ఇప్పటికే ఈ మేరకు కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణియించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆయా సెల్‌లకు పార్టీ నిర్ణయాలను తెలియజేశారు. కొత్త సభ్యులను చేర్పించిన వారికే ప్రాధాన్యత ఉంటుందనే విషయానికి కట్టుబడి ఉండాలని, తద్వారా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలని పిలుపు ఇచ్చారు. ‘పార్టీలో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సెల్‌లకు ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయకుంటే అసెం బ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఆయా సెల్ నాయకులకు ప్రాధాన్యత ఉండదని’ కూడా హెచ్చరించినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆఫీస్‌బేరర్ తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో 16 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించినట్లు చెప్పారు.
 
వివిధ మోర్చాలకు టార్గెట్‌లిలా..
వివిధ సెల్‌లకు పార్టీ టార్గెట్‌లు నిర్ణయించింది. పూర్వాంచల్ మోర్చా జనవరి 15వ తేదీ వరకు 10 లక్షల కొత్త సభ్యులను చేర్పించాలని సూచించింది. ఇప్పటి వరకు కేవలం సభ్యత నమోదు క్యాంపెయిన్ నిర్వహించి 1 లక్ష మంది కొత్త సభ్యులను చేర్పిం చింది. మైనార్టీ మోర్చా టార్గెట్ 2లక్షల మందిని చేర్పించాల్సి ఉండగా, కేవలం 40 వేల మందిని మాత్రమే చేర్పించింది. అనధికార కాలనీల్లో పట్టుసాధించడానికి పూర్వాంచల్ మోర్చా కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్కడ కూల్చివేతలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీకి పట్టు లభించే అవకాశం ఉండడంతో కొత్త సభ్యత్వాలను ముమ్మరం చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మోర్చాకు ఇచ్చిన టార్గెట్ 1.5 లక్షలు కాగా, ఇప్పటి వరకు 80,000 మందిని మాత్రమే పార్టీలో చేర్పించింది.
 
కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశాలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సాయంత్రం షిప్టులను నడిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై టీచర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకొంటున్నారు. వారి డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలను ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరెలా, నజాఫ్‌ఘర్‌లో కాలేజీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులు సూచించారు. కొత్త హాస్టల్స్, డిజిటల్ లైబ్రరరీ  ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ  వర్సిటీలతో తమ కాలేజీలు అనుబంధంగా ఉండడానికి అనుమతి ఇవ్వాలని   ప్రిన్సిపాళ్లు  ఆయనకు సూచించారు.

మరిన్ని వార్తలు