పనులు జరిగితే చాలు

24 Feb, 2015 23:26 IST|Sakshi

 ప్రసంగాలతో ప్రజలకు పనిలేదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్
 సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రసంగాలతో పనిలేదని,పనులు జరిగితే చాలని మాత్రమే వారు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. రెండో రోజైన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యుత్తు, నీటి చార్జీలు త్వరలో తగ్గుతాయని,  అవినీతి కూడా 40 నుంచి 50  శాతం తగ్గుతుందన్నారు. అవినీతిని అదుపులో పెట్టడం కోసం తమ ప్రభుత్వం త్వరలో టెలిఫోన్ సేవలను ప్రారంభిస్తుందని చెప్పారు. తమ తమ నియోజకవర్గాలలో నీటితో పాటు ప్రజలకున్న సమస్యలేమిటో తెలుసుకుని విధానసభకు తెలియచేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. ప్రతిపక్షాల స్థానాలు ఏడాదికాలంలోనే 40 నుంచి మూడుకు తగ్గాయంటూ వ్యంగాస్త్రం విసిరారు. ఆప్‌కు 67 సీట్లు వచ్చాయని, అయినంతమాత్రాన గర్వించరాదని ఆయన ఎమ్మెల్యేలను హచ్చరించారు.
 
 మూడు కారణాల వల్ల ప్రజలకు ఆప్‌కు ఓటు వేశారని చెప్పారు. ప్రజలు ప్రసంగాలు వినాలనుకోవడం లేదని, పనులు జరగాలని కోరుకుంటన్నారని చెప్పారు. గతంలో తమ 49 రోజుల పాలనలో అవినీతి చాలామటుకు తగ్గిందన్న విషయం కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారని చెప్పారు. అనేక ప్రాజెక్టులకు నిధులు ఎలా తగ్గించాలనే అంశంపై కసరత్తు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను కోరుతుందని, ప్రజలు ఇచ్చే ఆలోచనలకు కార్యరూపం ఇస్తామని చెప్పారు. కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ శాసనసభా పక్ష నేత  విజేందర్ గుప్తా పలుమార్లు అడ్డుపడ్డారు. మంత్రి గోపాల్ రాయ్ ఆప్ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన విషయాన్ని సభలో లేవనెత్తారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ కూడా సభకు హాజరైతే బావుంటుందని ఆప్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు