రేషన్ దుకాణదారులు తమ పద్ధతిని మార్చుకోవాలి

28 Mar, 2015 02:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఈ రేషన్ కార్డు విధానాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుల జారీలో అవినీతిని అంతమొందించడం కోసం ఈ రేషన్ కార్డులను ప్రవేశపెడ్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇన్నాళ్లుగా పేదలను మోసగిస్తూ అవినీతికి పాల్పడిన రేషన్ దుకాణ దారులు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేకపోతే దుకాణాలను వదిలివేయాలని ఆయన హెచ్చరించారు.
 
 ‘చౌకధరల దుకాణదారులు రేషన్ కార్డులను వినియోగదారులకు ఇవ్వకుండా తమ వద్దనే ఉంచుకోవడం నాకు తెలుసు. చాలామంది వినియోగదారులకు తమకు రేషన్ కార్డు జారీ అయిన విషయం తెలిసేది కాదు. స్వచ్ఛంద సంస్థ నడుపుతున్పప్పటి నుంచి నేను ఈ అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడాను. అవినీతికి పాల్పడే డీలర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు కూడా వేశాం. రేషన్ కార్డుల కోసం పోరాడినందుకు నాకు బెదిరింపులు కూడా వచ్చాయి’ అని ఆయన చెప్పారు. రేషన్ కార్డుల జారీలో సమస్యల పరిష్కారానికి ఎన్నో ఆలోచనలు చేశామని, ఈ సమస్యను పరిష్కరించే అవ కాశం తనకే వస్తుందని ఎన్నడూ అనుకోలేదని ఆయన వివరించారు.
 
 అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ రేషన్ కార్డు
 రేషన్ కార్డుల జారీలో వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఈ రేషన్ కార్డును ప్రవేశపెడ్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్ వస్తుందని, ఆ తరువాత వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డులు ఉన్నవారు ఈ రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు లేని వారు ఇతర గుర్తింపు కార్డుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ రేషన్ కార్డుల జారీలో నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ‘గతంలో రేషన్ కార్డు జారీ చేయడానికి నెలరోజుల సమయం పట్టేది. దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి ధ్రువీకరించుకున్న తరువాత కార్డు జారీ చేసేవారం. ఈ సమస్యలన్నీ తొలగించడానికే ఈ పద్ధతిని ప్రారంభించాం’ అని అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు