లసల్గావ్ మార్కెట్‌కు ఢిల్లీ బృందం

25 Oct, 2013 23:25 IST|Sakshi

 పుణే: ఉల్లిపాయల కొనుగోలు కోసం ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లా మార్కెట్‌కు వచ్చింది. జాతీయ రాజధాని నగరంలో కిలో ఉల్లిపాయలు రూ. 90 నుంచి రూ. 100 దాకా పలుకుతుండగా, ఈ మార్కెట్‌లో అంతకంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లాలోని లసల్గావ్ మార్కెట్‌కు వెళ్లింది. దీంతో ఆ మార్కెట్‌లో సరుకు లభ్యత విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో మాట్లాడా. వారి అవసరాలకు అనుగుణంగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తారు’ అని అన్నారు. ‘ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో దేశంలోనే అత్యంత పెద్ద ఉల్లిపాయల మార్కెట్ ఉంది. అక్కడ ఉల్లిపాయలను అక్రమంగా దాచరు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉల్లి పంట దిగుబడి తగ్గిపోయింది. నవంబర్ ఒకటో తేదీకల్లా కొత ్త పంట మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. అప్పటినుంచి పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది’ అని అన్నారు.
 
 లసల్గావ్ మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించామని, అందువల్ల ఉల్లిపాయలను అనేకరోజులపాటు నిల్వ ఉంచేందుకు వీలవుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందానికి కొనుగోలు చేసేందుకు వీలుగా అవసరమైనంతమేర ఉల్లిపాయలను అందుబాటులో ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
 

మరిన్ని వార్తలు