డిప్యూటీ సీఎం ఇంటిముందు చెత్తవేసి మరీ...

28 Jan, 2016 12:42 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి  తీవ్రంగా తాకుతోంది.  వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలంటూ  పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది.  తమ డిమాండ్ల సాధనకు వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. నిన్నముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన  ఆందోళనకారులు తమ పోరాట వేదికను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటికి మార్చారు. చెత్తా చెదారాన్ని మనీష్‌ ఇంటి లోపలకి విసిరేసి.... నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది.

మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తుతోంది. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే.... బతికేదెలా అని ప్రశ్నించారు. తమను  పస్తులు ఉంచుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టిపోశారు. డిమాండ్లు సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.  అటు  కార్మికులు చేస్తున్న సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు