పాతఢిల్లీలో ఐదు సబ్‌వేలు

4 May, 2014 23:50 IST|Sakshi

 న్యూఢిల్లీ: సెంట్రల్ సెక్రటేరియట్-కాశ్మీరీ గేట్ కారిడార్‌లో భాగంగా పాత ఢిల్లీలో ఐదు స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలు, పాదచారుల కోసం సబ్‌వేలను నిర్మించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. 2015 కల్లా వీటిని పూర్తిచేయాలని ప్రతిపాదనలు తయారుచేసినట్లు డీఎంఆర్‌సీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఐదు సబ్‌వేలను ఢిల్లీ గేట్, జామా మసీద్, లాల్‌ఖిలా మెట్రో స్టేషన్లలో నిర్మించనున్నట్లు తెలిపారు. వీటినే ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్లు దాటేందుకు పాదచారులు సైతం సబ్‌వేలుగా ఉపయోగించుకునేలా రూపకల్పన చేయనున్నారు. ఢిల్లీ గేట్ వద్ద బహదూర్ షా మార్గ్ కింది నుంచి నిర్మించున్న సబ్‌వే ఫిరోజ్‌షా కోట్లా, అంబేద్కర్ స్టేడియం మధ్య దూరాన్ని తగ్గించనుంది. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్, అసఫ్ అలీ రోడ్ కింది నుంచి నిర్మించనున్న సబ్ వే ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ భవనంతో లోక్‌నాయక్ జైప్రకాష్ ఆస్పత్రిని కలుపుతోంది. ఇదిలా ఉండగా, జామా మసీద్ మెట్రో స్టేషన్ వద్ద నేతాజీ సుభాష్ మార్గ్‌ను, జామా మసీద్‌ను అనుసంధానపరుస్తూ సబ్‌వేను నిర్మించనున్నారు.
 
 అలాగే నేతాజీ సుభాష్ మార్గ్ నుంచి ఎర్రకోట వైపు ఉన్న రోడ్డుకు కలుపుతూ మరో రెండు సబ్‌వేలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ సబ్‌వేల నిర్మాణం వల్ల స్థానికంగా ఉంటున్న ప్రజలకు చాలా ఇబ్బందులు తగ్గనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం చాలా పరిమితంగా ఉన్న పాదచారుల సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు వీరి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో వీటిని కూడా ఫేజ్ -3 పనుల్లో భాగంగా మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్ర్కమణ మార్గాలుగా మార్చేందుకు ఢిల్లీ మెట్రో యత్నిస్తోంది. ఇదేవిధంగా రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లలో కూడా అవసరమైన సదుపాయాలను ఏర్పాటుచేయాలని ఢిల్లీ మెట్రో యోచిస్తోంది. ఫేజ్-3 ప్రాజెక్టులో భాగంగా నగరంలోని 138 కి.మీ.ల మేర విస్తరించాలని ఢిల్లీ మెట్రో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
 

మరిన్ని వార్తలు