ఢిల్లీ మెట్రో సేవలు భేష్

25 Dec, 2014 22:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) తన కార్యకలాపాలు ప్రారంభించి 12 ఏళ్లు పూర్తిచేసుకుంది. ప్రయాణికుల ఆదరణ పొందుతూ అంచలంచెలుగా విస్తరణ చెందుతున్న ఢిల్లీ మెట్రో కారణంగా 2014 సంవత్సరంలో దాదాపు రూ. 10,346 కోట్ల పొదుపు జరిగిందని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఆర్‌ఆర్‌ఐ) అంచనా వేసింది. 190 కి.మీ. పొడవున్న ఈ మెట్రో నెట్ వర్క్ కారణంగా ప్రాణ నష్టం ఏటా గణనీయంగా తగ్గుతోందని అంచనా వేసింది. సంబంధిత వివరాలను డీఎంఆర్‌సీ  ఛైర్మన్ మంగూసింగ్ మీడియాకు వె ల్లడించారు. ఇంధన పొదుపు విషయానికి వస్తే ఢిల్లీ మెట్రో దాదాపు రూ. 1,972 కోట్ల విలువైన ధనాన్ని పొదుపు చేసింది. 2011లో దాదాపు 1.06 లక్షల టన్నుల ఇంధనం పొదుపు అవగా.. 2014లో ఇది 2.7 లక్షల టన్నులకు చే రుకుంది. ఇక వాహన పెట్టుబడి- నిర్వహణ వ్యయం రూ. 2,617 కోట్లు మేర ఆదా అయ్యింది.
 
 ప్రయాణికుల అమూల్యమైన సమయానికి లెక్కకడితే దాని విలువ రూ. 4,107 కోట్లు అవుతుందని సింగ్ వివరించారు. అంతేకాకుండా 2007లో 16,895 వాహనాల వినియోగం తగ్గితే... 2011లో 1,17,249 వాహనాల వినియోగం తగ్గిందని, 2014లో ఆ సంఖ్య 3,90,971కి చేరిందని వివరించారు. 2007లో 24,691 టన్నుల ఇంధనం పొదుపవగా.. 2014లో 2,76,000 టన్నుల ఇంధనం పొందుపైందని వివరించారు. 2011లో ప్రతి ప్రయాణికుడికి తాను ప్రయాణం చేసినప్పుడు 28 నిమిషాలు ఆదా కాగా.. ఈ ఏడాది 32 నిమిషాలు ఆదా అయ్యిందని తెలిపారు. అలాగే ట్రాఫిక్ జాముల కారణంగా వృథా అయ్యే ఇంధనం మెట్రోల ద్వారా మిగిలిందని, దీని విలువ రూ. 491 కోట్లు ఉంటుందని వివరించారు. అలాగే కాలుష్యం తగ్గింపు కారణంగా దాదాపు రూ. 489 కోట్లు ఆదా అయ్యింది. ఈ అన్ని అంశాలు కలిపితే 2014లో రూ. 10,346 కోట్లు ఆదా అయినట్లని వివరించారు. ఏటా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తెలిపారు.
 
 క్రమంగా విస్తరణ
 ఢిల్లీ మెట్రో రైలు తన సేవలను క్రమంగా విస్తరిస్తోంది. 2014లో జన్‌పథ్, మండీ హౌజ్ స్టేషన్లను ప్రారంభించింది. అలాగే 11 రైళ్లను 8 కోచ్‌లు గల రైళ్లుగా మార్చింది. ఫేజ్-1లో 65 కి.మీ. ఫేజ్-2లో 125 కి.మీ. మేర మెట్రో నెట్‌వ ర్క్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫేజ్-3, ఫేజ్-4 విస్తరణ పనులు నడుస్తున్నాయి. ఫేజ్-3లో మరో 167.27 కి.మీ. మేర  నెట్‌వర్క్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫేజ్-4లో మరో 100 కి.మీ. మేర నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.
 

మరిన్ని వార్తలు