ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల వివరణ కోరిన ఎన్‌జీటీ

27 Aug, 2013 02:21 IST|Sakshi
న్యూఢిల్లీ: నీటిని అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై జాతీయ పర్యావరణ న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల వివరణ కోరింది. ఢిల్లీలో భూగర్భ జలాలను కొల్లగొడుతున్న మాఫియాతో మిలాకత్ అయిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపిస్తూ రాజ్‌హన్స్ బన్సాల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వతంతర్‌కుమార్ కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ, ఢిల్లీ జల్‌బోర్డు, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లకు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీనాటికి సమాధానం ఇవ్వాలని నోటీసుల ద్వారా ఆదేశించారు. 
 
 పిటిషనర్ బన్సాల్ న్యాయవాది వికాస్ పడోరా ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో ‘‘వ్యక్తులు, సమూహలు, అధికారి లేదా సంస్థలకు చెందిన వారు కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ముందస్తు అనుమతి లేకుండా బోరుబావులు తవ్వరాదని జూలై 2010న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూగర్భ జలవనరుల వినియోగం కోసం డిల్లీ జల్‌బోర్డు, కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ, ఎన్‌డీఎంసీల అనుమతితోనే గృహ, వ్యాపార, వ్యవసాయ అవసరాలకు బోరు బావులు తవ్వాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ అమలులోకి వచ్చిన తరువాత కూడా ఢిల్లీలో అనేక అక్రమ బోరు బావులు త వ్వి నీటి వనరులను కొల్లగొడుతున్నారు. ద్వారకా సెక్టార్-24లో వందలాది అక్రమ బోరు బావుల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. విచక్షణ లేకుండా బోరు బావుల తవ్వకాల వలన భూగర్భ జల వనరులు అడుగంటి పోయి పర్యావరణానికి హాని జరుగుతుంది’’ అని న్యాయస్థానం దృష్టికి తెచ్చాడు.
 
 బోరుబావుల కేసులో మళ్లీ దర్యాప్తు
 బోరుబావుల పైపులైన్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు జల్‌బోర్డు అధికారుల మీద మళ్లీ దర్యాప్తు జరపాలని నగర కోర్టు సీబీఐని ఆదేశించింది. కాంట్రాక్టర్‌తో కుమ్ముక్కై పైపులైన్ల నిర్మాణానికి సంబంధించి కొలతల పుస్తకంలో తప్పుడు లెక్కలు రాశారని ఆరుగురు జల్‌బోర్డు అధికారులపై ఆరోపణ. ఈ అధికారులు వాస్తవిక పరిస్థితి కంటే ఐదారు రెట్లు అధిక ధరలు నమోదు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో సమాచారం అందుకున్న సీబీఐ సెప్టెంబర్ 2011లో డీజేబీ అధికారులు పీకే జైన్, ఎన్‌కే ఖరే, శివ్‌హరి, బీరేంద్ర సింగ్, ఆర్‌బీ శర్మ, అశోక్‌పాల్ పన్వర్‌లతో పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్ మెస్సర్స్ ఆర్‌బీ సేల్స్ (ఇండియా)ల మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా విచారణ ముగింపు నివేదికలో ‘‘బోరు బావులు తిరిగి ఏ మేరకు తవ్వింది జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (హైదరాబాద్) అధికారుల మదింపు కోరాము.
 
 కాంట్రాక్టర్లు వాడిన పైపుల నాణ్యతా ప్రమాణాలను కూడా వీరే పరిశీలించారు’’ అని కోర్టుకు వివరించారు. సేకరించిన సాక్ష్యాల మేరకు అధికారుల మీద ఆరోపణలు నిర్ధారణ కాలేదని కోర్టుకు నివేదించారు. ఎలాంటి కేసు నమోదు చేయకుండా కేసు ముగింపును కోరారు. సీబీఐ అధికారుల అభ్యర్థనను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి మనోజ్ జైన్ ‘‘ఆరుగురు జల్‌బోర్డు ఉద్యోగుల మీద ఎలాంటి కేసు నమోదు చేయకుండా కేసు ముగింపును కోరడం అసమంజసం. కాంట్రాక్టర్లు వేసిన పైపుల నాణ్యత, తవ్విన లోతు, బోరు బావులను తిరిగి తవ్విన వివరాలను విచారణాధికారులు నమోదు చేయలేదు. కాబట్టి కేసును పునర్విచారణ చేయాలి’’ అని ఆదేశిస్తున్నాను అని పేర్కొన్నారు.
 
>
మరిన్ని వార్తలు