పది మంది ప్రాణాలు కాపాడిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌

20 Dec, 2018 09:54 IST|Sakshi

ముంబై: ముంబైలోని తూర్పు అంధేరిలోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్‌ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి పది మంది ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సిద్ధు(20) అటుగా వెళ్తూ.. అగ్ని ప్రమాద దృశ్యాలను చూశారు. వెంటనే అక్కడ మంటలు ఆర్పుతున్న అగ్ని మాపక సిబ్బంది వద్దకు వెళ్లి తాను కూడా సహాయక చర్యల్లో పాల్గొంటానని తెలిపారు. వారి అంగీకారంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిద్ధు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి పది మంది ప్రాణాలు కాపాడారు. నాలుగో అంతస్తులోని పెషెంట్‌లను అగ్ని మాపక దళానికి చెందిన నిచ్చెన ద్వారా కిందకి దించడంలో కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో దట్టమైన పొగ వల్ల అనారోగ్యానికి గురైన సిద్ధు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనపై సిద్ధు మీడియాతో మాట్లాడుతూ.. ‘తమను కాపాడామంటూ ఆస్పత్రిలో నుంచి పెషేంట్‌లు కేకలు వినబడటంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అగ్ని మాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాను. గొడ్డలితో బిల్డింగ్‌ అద్దాలను పగులగొట్టి ఆస్పత్రిలోనికి ప్రవేశించాను. అక్కడి నుంచి నిచ్చెన ద్వారా పెషెంట్‌లను కిందకు దించాను. ఆ సమయంలో ఓ మహిళ నా చేతుల నుంచి జారి కింద పడిపోయారు. కానీ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నార’ని తెలిపారు.

మరిన్ని వార్తలు