-

కొండను తవ్వి ఎలుకను పట్టి..

14 Dec, 2016 03:17 IST|Sakshi
కొండను తవ్వి ఎలుకను పట్టి..

నోట్ల రద్దుపై చిదంబరం తీవ్ర విమర్శలు
పల్లె ప్రజల బాధలు వర్ణానాతీతమని వ్యాఖ్య
క్యూలో ఒక్క ధనవంతుడైనా కనిపిస్తున్నాడా?: రాహుల్‌


నాగ్‌పూర్‌/న్యూఢిల్లీ: నోట్ల రద్దు  నిర్ణయం అనాలోచితమని, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం పేదలపై దాడికి పాల్పడిందని... నగదు కోసం పేదలే క్యూలో నిలబడుతున్నారని, ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది లేదని తప్పుపట్టారు.  ‘ఇది పేద ప్రజలపై భయంకరమైన దాడి. ఈ నిర్ణయం 45 కోట్ల ప్రజల వెన్ను విరిచింది. పేదలకు శిక్షగా పరిణమించింది. నాకు తెలిసి ఏ ధనవంతుడు నోట్ల రద్దుతో ఇబ్బంది పడలేదు’అని మంగళవారం నాగ్‌పూర్‌లో అన్నారు. 

రోజువారీ కూలీలకు పని దొరకడం లేదని, గత 30 రోజులుగా గ్రామాల్లో మార్కెట్లు, షాపులు మూతపడ్డాయని విమర్శించారు. ప్రపంచంలో ఎన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు నగదు రహితమో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.‘ప్రపంచంలో చిన్నచిన్న కొనుగోళ్లు నగదుతోనే జరుగుతాయి.. కార్డులతో కాదు. భారత్‌లో 3%గా ఉన్న నగదు రహిత కార్యకలాపాలు కొద్ది నెలల్లో 100% చేరుకోవాలని ఆశించడం అసాధారణం’ అని చెప్పారు. నోట్ల రద్దుతో ధనవంతులు ఇబ్బందిపడ్డారని, పేదలు లాభపడ్డారనేది భ్రమేనని, పల్లె ప్రజల బాధలు వర్ణనాతీతమని అన్నారు.

‘ఈశాన్య భారత ప్రజల దుస్థితిని ఒకసారి ఊహించుకోండి. కేవలం 5 వేల ఏటీఎంలు ఉండగా 3,500 అస్సాంలోనే ఉన్నాయి. అందులో అధిక శాతం పనిచేయడం లేదు. ఇక దేశవ్యాప్తంగా 65% ఏటీఎంల్లో నగదు లేదు’ అని చెప్పారు. పలు చోట్ల రూ. 2 వేల నోట్ల స్వాధీనంతో నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద స్కాంగా తేలిందని, వీటన్నింటిపై సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. నోట్ల రద్దుతో అవినీతిని ఎలా అరికట్టాలో చెప్పాలని, ఇప్పుడు లంచాన్ని రూ. 2 వేల నోట్ల రూపంలో తీసుకుంటారని చెప్పారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం బీజేపీకే చెందిన ఆర్థిక  మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను సంప్రదించినా బాగుండేదన్నారు.
 
పేదలపై యుద్ధం: రాహుల్‌

నవంబర్‌ 8న మోదీ పేదలపై యుద్ధం ప్రకటించారంటూ ఉత్తరప్రదేశ్‌లోని అనాజ్‌ మండిలో రాహుల్‌ విమర్శించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ.. నిజాయితీపరులను క్యూల్లో నిలబెడుతున్నారని, అవినీతిపరులు వెనుక నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు క్యూలలో కనీసం ఒక్క సంపన్నుడైనా కనబడుతున్నారా’అని ప్రశ్నించారు. మోదీ రోజురోజుకూ మాటలు మారుస్తున్నారని విమర్శించారు. మొదట్లో నల్లధనానికి వ్యతిరేకంగా పెద్ద నోట్లను రద్దు చేశానని,  తర్వాత ఉగ్రవాదంపై పోరాడటానికని, ఇప్పుడేమో నగదు రహిత సమాజం కోసమని అంటున్నారని దుయ్యబట్టారు. ‘నగదు రహిత సమాజం వస్తే రైతులకు తెలియకుండానే వారి సొమ్ము పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళ్లిపోతుంది. కొందరు పెద్ద వ్యాపారులు రూ. 8 లక్షల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. ప్రధాని మోదీ వాళ్ల నుంచి ఆ డబ్బును రాబట్ట లేకపోతున్నారు’అని రాహుల్‌ విమర్శల వర్షం కురిపించారు.

కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది: జైట్లీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కుంభకోణాల చరిత్రకు మోదీ అవినీతి వ్యతిరేక ప్రచారం తీవ్ర అసౌకర్యంగా మారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ  మంగళవారం విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో భారత్‌ తక్కువ నగదుతో నడిచే ఆర్థిక వ్యవస్థ, డిజిటల్‌ చెల్లింపుల దిశగా నడుస్తుందని, పన్ను ఆదాయం పెంచడంతో పాటు, పన్నుల ఎగవేత కూడా  తగ్గుతుందన్నారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి రద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్ల జారీని వేగవంతం చేశామన్నారు. యూపీఏ పదేళ్ల హయాంలో అవినీతి, నల్లధనం అరికట్టేందుకు కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు