ఐఏఎఫ్ డిపో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది

25 Sep, 2014 22:37 IST|Sakshi

 గుర్గావ్: భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) ఆయుధ డిపోకి సమీపంలో బుధవారం రాత్రి జిల్లా అధికార యంత్రాంగం అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు గురువారం తెలియజేశారు. ఈ డిపోకి సమీపంలోని ఓంవిహార్ ప్రాంతంలో దాదాపు 12కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు. వాస్తవానికి ఈ పరిసరాల్లో నిర్మాణాలు నిషిద్ధమని, అయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కొందరు నిర్మాణ పనులను చేపట్టారన్నారు. ఉపగ్రహ అధ్యయనంతో ఈ విషయం వెలుగుచూసిందన్నారు. ఇదిలాఉంచితే ఈ ప్రాంతంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలను స్థానికులు నిరసించారు.  నివాసాలను ఖాళీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం తమకు తగినంత సమయమివ్వలేదని ఆరోపించారు. కాగా ఆక్రమణల కూల్చివేత కార్యక్రమంలో నగర పాలక సంస్థ (ఎంసీజీ)కి చెందిన నాలుగు వందల మంది సిబ్బంది పాల్గొన్నారు. 400 మంది పోలీసు సిబ్బంది వీరికి అండగా నిలిచారు. రాత్రి ఏడు గంటల సమయంలో ప్రారంభమైన కూల్చివేతల పర్వం గురువారం ఉదయం వరకూ కొనసాగింది.
 

మరిన్ని వార్తలు