అక్రమ నిర్మాణం కూల్చివేత

30 Jan, 2014 00:13 IST|Sakshi

భివండీ, న్యూస్‌లైన్: అక్రమ నిర్మాణాలపై (బీఎన్‌ఎంసీ) కొరడా ఝళిపించింది. ఎటువంటి అనుమతులు పొందకుండానే ప్రభాగ్ సమితి నాలుగులో నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కార్పొరేషన్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం కూల్చారు.  నవీన్ గౌరీపాడా ప్రాంతానికి చెందిన నయీమ్ పఠాన్‌కు చెందిన ఖాళీస్థలాన్ని అక్రమ్ శేఖ్ అనే బిల్డర్ అభివృద్ధి కోసం తీసుకున్నాడు.

 అయితే కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మూడంతస్తుల భవన నిర్మాణ పనులను చేపట్టాడు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాల్సిందిగా కార్పొరేషన్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయినా బిల్డర్ ఆ నోటీసులను పట్టించుకోకుండా పనులను కొనసాగించాడు. దీంతో స్థానిక బోయివాడ స్టేషన్‌కు చెందిన పోలీసుల  బందోబస్తు మధ్య కార్పోరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చారు.

ఇందులో నాలుగో ప్రభాగ్ సమితి అధికారి సునీల్ బాలేరావ్‌తోపాటు గోండాంబే, బాలారామ్ జాదవ్, భగత్ ఉగడే, సోమనాథ్ సోస్టే, దిలీప్ మాళీ, శేఖర్ మడకే తదితరులున్నారు. ఇదిలాఉండగా పట్టణంలో ప్రస్తుతం సుమారు వెయ్యికిపైగా నిర్మాణాలు అనుమతులు లేకుండా జరుగుతున్నట్టు తెలియవచ్చింది. 

మరిన్ని వార్తలు