కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్

23 Nov, 2016 09:57 IST|Sakshi
కేంద్రం లీకిచ్చింది.. బాబుకు ముందే తెలుసు: వైఎస్ జగన్

రాజమహేంద్రవరం: 'పెద్ద నోట్ల రద్దువంటి పెద్ద అంశాలపై అధికార ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం, సామాన్యులను సంప్రదించడం చేస్తుంది. ఆ నిర్ణయం తర్వాత ఏర్పడే ప్రభావం నుంచి బయటపడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై ప్రజల పక్షాన ప్రతిపక్షం గొంతు విప్పుతుందని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద నోట్లను రద్దు చేయగానే తన సూచన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు అన్నారని, అంతవేగంగా ఆయనెలా స్పందించగలిగారని ప్రశ్నించారు. కేంద్రం సెలక్టివ్ పీపుల్స్ కు ముందే లీకులిచ్చిందని, అందులో చంద్రబాబు కూడా ఉన్నారని, అందులో భాగంగానే అక్టోబర్ 12న చంద్రబాబు రూ.500, రూ.1000నోట్లను రద్దు చేయాలని లేఖ రాశారని వైఎస్ జగన్ చెప్పారు. కేంద్రం నిర్ణయానికి సరిగ్గా నెల రోజుల ముందు చంద్రబాబు తన పరిస్థితులు చక్కబెట్టుకొని సామాన్యులను మాత్రం గాలికొదిలేశారని అన్నారు. చంద్రబాబు చర్యలు చూశాక కూడా ఎవరికీ తెలియకుండానే తాము నిర్ణయం వెలువరించామని కేంద్రం చెప్పే మాటలు తాము ఎలా నమ్మాలని ప్రశ్నించారు.