కిరణ్‌ భేడీ వర్సెస్‌ సీఎం

22 Dec, 2016 11:45 IST|Sakshi
 కిరణ్‌ వర్సెస్‌ నారాయణ 
 అధికారుల మల్లగుల్లాలు
 పుదుచ్చేరిలో రసవత్తరం
 
చెన్నై: పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ భేడీ,  సీఎం నారాయణస్వామిల మధ్య అంతర్యుద్ధం ముదిరినట్టుంది. కేంద్ర ప్రభుత్వ నగదు రహిత లావాదేవీల నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తే గవర్నర్‌ ఆహ్వానించడం అంతర్యుద్ధాన్ని తెర మీదకు తెచ్చింది. దీనిని అమలు చేయాల్సిందేనని అధికారుల్ని గవర్నర్‌ ఆదేశిస్తే, ఆపాల్సిందేనని సీఎం స్పష్టం చేయడం వెరసి అధికారులు మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి. 
 
పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎన్నికల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. కొత్త  ప్రభుత్వానికి పక్కలో బల్లెం అన్నట్టుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ భేడీని కేంద్రం నియమించడం కాంగ్రెస్‌ వర్గాలకు షాక్కే. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టేందుకు ముందే, కిరణ్‌ తన దూకుడును ప్రదర్శించారని చెప్పవచ్చు. సంస్కరణలు, కొత్త విధానాలు , నిబంధనలు అంటూ పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల మనస్సు చూరగొనే రీతిలో పరుగులు తీశారు. కిరణ్‌ దూకుడుకు కల్లెం వేసే రీతిలో కాంగ్రెస్‌ అధిష్టానం నారాయణస్వామి చేతికి సీఎం పగ్గాలను అప్పగించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య అంతుర్యద్ధం సాగుతూ వస్తున్నదని చెప్పవచ్చు.
 
సీఎం, లెఫ్టినెంట్‌ గవర్నర్ల మధ్య విబేధాలు సాగుతున్నట్టుగా వార్తలు రావడం, దానిని ఆ ఇద్దరూ ఖండించిన సందర్భా లూ అనేకం. పుదుచ్చేరి ప్రగతి కోసం తామిద్దరం శ్రమిస్తున్నామని స్పందించి ఉన్నారు. అదే సమయంలో కిరణ్‌ సంస్కరణలకు చెక్‌ పెట్టే రీతిలో చాప కింద నీరులా  నారాయణస్వామి ప్రయత్నాలు చేపట్టడం,  అన్ని విభాగాల్లోని అధికారుల, కింది స్థాయి ఉద్యోగులకు కొత్త ప్రభుత్వం హిత బోధ చేయడం, గవర్నర్‌ ఆదేశాలు రాజ్‌భవన్‌ వరకే పరిమితం చేయించడం, తమ ఆదేశాల్ని అమలు పరిచే విధంగా ముందుకు సాగిన సందర్భాలు అనేకం. సీఎంకు చెక్‌ పెట్టే రీతి లో, ప్రజల మనస్సు చూరగొనే విధంగా కిరణ్‌ అడుగులు వేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతుర్యుద్ధం ముదిరినట్టుంది.  ఇన్నాళ్లు ఈ ఇద్దరు మేధావుల మధ్య చాప కింద నీరులా సాగుతూ వచ్చిన విభేదా లు, మంగళవారం తెర మీదకు వచ్చినట్టుగా పరిస్థితి నెలకొంది. ఇందుకు అద్దంపట్టే విధంగా కిరణ్‌ ఆదేశాలను అమలు పరచొద్దన్నట్టుగా సీఎం పరోక్ష హెచ్చరికలు అధికారుల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఉన్నాయి. 
 
అధికారుల ఉక్కిరి బిక్కిరి
సీఎం, గవర్నర్‌ల మధ్య పుదుచ్చేరి అధికార వర్గాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎవరి ఆదేశాలను అమలు చేయాలో, ఎవరి ఉత్తర్వులను ఉల్లంఘించాలో తెలియక మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి. కేంద్రం నల్లధనాన్ని నిర్మూలించేందుకు పాత నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ప్రజలు పడుతున్న కష్టాలతో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కేంద్రం తీరుపై తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నగదు రహిత లావాదేవీలు సాగే విధంగా కార్టుల స్వైప్‌ ద్వారా ప్రకియను సాగించేందుకు తగ్గ నిర్ణయాన్ని మోదీ సర్కారు తీసుకుని ఉన్నది. దీనిని అమలు చేయడానికి తగ్గ చర్యలు వేగవంతం చేసేందుకు తగ్గ ఆదేశాలుపుదుచ్చేరికి చేరి ఉన్నాయి. అయితే, తమ రాష్ట్రంలో అనుమతించ బోమంటూ సీఎం నారాయణస్వామి స్పష్టం చేసి ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు కల్గే విధంగా తాము చర్యలు తీసుకోలేమని, దశల వారీగా ఈ పథకాన్ని అమల్లోకి తెద్దామంటూ వ్యతిరేకించే పనిలో పడ్డారు.
 
ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ చర్యలు చేపట్టడం సీఎంతో ఉన్న వివాదాన్ని తెర మీదకు తెచ్చినట్టు చేసింది. రాజ్‌ భవన్‌లో ఇందుకు తగ్గ సమావేశం జరగడం, కేంద్ర నిర్ణయాన్ని అమలు పరిచేందుకు తగ్గ చర్యలు వేగవంతం చేయాలని అధికారుల్ని కిరణ్‌ ఆదేశించడం సీఎంకు మింగుడు పడనట్టుంది. తాము వ్యతిరేకిస్తుంటే, గవర్నర్‌ దూకుడుగా ముందుకు సాగుతుండడాన్ని ఖండించే రీతిలో ఆమె  ఆదేశాల్ని అమలు పరచవద్దంటూ అధికారుల్ని పరోక్షంగా సీఎం హెచ్చరించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆ పథకాన్ని అమలు పరచాలా..? వద్దా...? ఎవరి మాట వినాలో..అని  అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతుండడం గమనార్హం.  
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు