ఎనీటైమ్ పడిగాపులే

3 Dec, 2016 04:17 IST|Sakshi
ఎనీటైమ్ పడిగాపులే

నగదు లేక అలంకారప్రాయంగా ఏటీఎంలు
- 7,041 యంత్రాలకు గాను పనిచేసినవి 1,325
- అక్కడ కూడా మధ్యాహ్నానికే డబ్బులు ఖాళీ
- ఉత్త చేతులతో ఉసూరుమంటూ వెళ్లిన జనం
- పనిచేస్తున్న ఏటీఎంలలోనూ రూ.2 వేల నోట్లే దిక్కు
- వాటికి చిల్లర పుట్టక ప్రజల అగచాట్లు
- ఏటీఎంలలో అందుబాటులోకి రాని రూ.500 నోట్లు
- బ్యాంకుల్లో భారీ లైన్లు.. వృద్ధులు, దివ్యాంగుల దీనావస్థ
 
 సాక్షి నెట్‌వర్క్
 ఏటీఎం.. అసలు పేరు ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్ అయినా ఎప్పుడంటే అప్పుడు నగదు తీసుకునేందుకు ఉపయోగపడే యంత్రాలుగానే అందరికీ సుపరిచితం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఏటీఎంల సేవలు అందకుండా పోయాయి. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఇవి నగదు లేక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద ‘నో క్యాష్’, ‘ఔట్ ఆఫ్ సర్వీస్’, ‘ఔట్ ఆఫ్ ఆర్డర్’, ‘నాట్ వర్కింగ్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,041 ఏటీఏం కేంద్రాలు ఉండగా, శుక్రవారం కేవలం 1,325 కేంద్రాలే పనిచేశారుు. ఈ కేంద్రాల్లోనూ మధ్యాహ్నానికే నగదు ఖాళీ కావడంతో అప్పటిదాకా క్యూలో నిల్చున్న జనం నిరాశ చెందారు. కొన్నిచోట్ల రాత్రి, పగలు అనే తేడా లేకుండా జనం అన్ని పనులు మానుకొని నగదు కోసం ఏటీఎంల వద్దే పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా పనిచేస్తున్న ఏటీఎంలలో రూ.2,000 నోట్లే వస్తున్నారుు. వీటిని మార్చుకొని చిల్లర సంపాదించడం మరో ప్రహసనంగా మారుతోంది.

 రూ.100 నోట్లు ఖాళీ
 కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రజలు ఖాతాల్లో ఉన్న నగదు ఉపసంహరణ కోసం ప్రధానంగా ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. బ్యాంకుల వద్ద రూ.100 నోట్ల నిల్వలు ఖాళీ కావడం, కొత్త నోట్లు రాకపోవడం, జనం తమ వద్ద ఉన్న రూ.100 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం వంటి కారణాలతో ఏటీఎంలు మూతపడుతున్నాయి. పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో నగదు కష్టాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. నిత్యావసరాల కోనుగోలుకు కూడా చేతిలో డబ్బులేక, బ్యాంకుల్లో అందే అవకాశం లేక, ఆఖరికి ఏటీఎంలలోనూ దొరక్క ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కరెన్సీ కొరత లేదని, కావాల్సినంత నగదు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నా... ఆ సొమ్ము సామాన్యుల దాకా చేరడం లేదు. మరోవైపు కొత్త రూ.500 నోట్లు ఇంకా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. ఇవి విసృ్తతంగా ఏటీఎంలో అందుబాటులోకి చాలా వరకు సమస్య తీరిపోతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.

 రూ.4 వేలు చేతిలో పెట్టారు
 డిసెంబర్ నెల తొలిరోజు గురువారం బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభించక ఉద్యోగులు, పింఛన్‌దారులు, సామాన్య ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. రెండో రోజు శుక్రవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డా చాలామందికి నగదు దొరకలేదు. కొన్నిచోట్ల బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుంటే చివరకు రూ.4 వేలు చేతిలో పెట్టి పంపేశారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. నెలకు రూ.25,000 జీతం తీసుకునే వారికి ఇప్పుడు ఈ డబ్బులు ఏ మూలకు చాలుతాయని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు.

క్యూ లైన్‌లో సొమ్మసిల్లుతున్న వృద్ధులు
 పింఛన్ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంటున్నారుు. వేకువజామునే నిద్రలేచి ఉదయాన్నే బ్యాంకుల ఎదుట బారులు తీరుతున్న వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల శుక్రవారం ఒక్కరోజే దాదాపు 20 మంది వృద్ధులు బ్యాంకుల వద్ద సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ లైన్‌లో గంటల తరబడి నిల్చోవాల్సి రావడంతో నీరసించిపోతున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కార్శిక సూర్యకుమారి అనే వృద్ధురాలు పింఛను సొమ్ము కోసం గ్రామంలోని ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చి సొమ్మసిల్లి పడిపోరుుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు