వీడని భయం

23 Feb, 2015 00:02 IST|Sakshi

శివమొగ్గలో భారీగా బలగాల మొహరింపు
బంధువుల ఊళ్లకు పయనమైన నగర ప్రజలు
పోలీసుల అదుపులో వంద మంది
మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల పరిహారం
 

శివమొగ్గ వాసులను భయం వెన్నాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఆదివారం తమ బంధువుల ఊళ్లకు పలువురు నగర వాసులు పయనమై వెళ్లారు. కేఎస్ ఆర్టీసీ బస్సుల సంచారం పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేట్ బస్సులపై ప్రయాణికులు ఆధారపడ్డారు. అల్లర్లకు సంబంధించి వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నగరం మొత్తం భారీగా బలగాలను మొహరింపజేశారు.
 
 శివమొగ్గ : ఈ నెల 19న శివమొగ్గలో పీఎఫ్‌ఐ సంస్థ చేపట్టిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణలు మూడు రోజుల పాటు నగరాన్ని కుదిపేశాయి. ఎటు చూసిన విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భారీ బలగాలను పోలీస్ యం త్రాంగం మొహరింపజేసింది. నగరం మొత్తం ఖాకీల మయమైంది. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో పొరుగూళ్లలో ఉన్న తమ బంధువుల ఇళ్లకు చాలా మంది ఆదివారం పయనమై వెళ్లారు. సీఆర్‌పీఎస్ బల గాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లు నగరంలో గస్తీ తిరుగుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ఆటోలు, ప్రైవేట్ బస్సులు మాత్రం రోడ్డుపైకి వచ్చాయి. వ్యాపార కేంద్రాలన్నీ మూతపడ్డాయి. 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టేందుకు అల్లరిమూకలు విఫలయత్నం చేశాయి.
 
పోలీసుల అదుపులో వంద మంది


అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర శాంతిభద్రత విభాగం ఏడీజీపీ  షోర్ చంద్ర ఇక్కడే తిష్టవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంటోందని అన్నారు. ఇద్దరిని హతమార్చిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రత పర్యవేక్షణలో 24 బెటాలియన్ల కేఎస్‌ఆర్‌పీ బలగాలు, ఆరు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్, 20 బెటాలి యన్ల డీఏఆర్‌క్యూర్‌టీ బలగాలతో పాటు 2500 మంది కానిస్టేబుళ్లను నియమించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్ర హోం శాఖ సలహాదారుడు కెంపయ్య ఆదివారం ఇక్కడకు వచ్చి పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. కాగా, అల్లర్లలో చిక్కుకుని హత్యకు గురైన విశ్వనాథ్, మంజునాథ్ కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కి మ్మనె రత్నాకర్ అన్నారుృ మతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. పది లక్షల చొప్పున పరిహారాన్ని అం దజేయనున్నట్లు చెప్పారు.

పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని శిక్షించాలి

పీఎఫ్‌ఐ సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహిస్తూ పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఈ సందర్భంగా మాజీ డీసీఎం కె.ఎస్.ఈశ్వరప్ప గుర్తు చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముం దు ఆయన రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య, ఉ న్నతాధికారులను కలిసి చర్చించారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదని హితవు చెప్పడంతో ఓ వర్గం పథకం ప్రకారం దాడులకు పూనుకుం దని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఆఖరుకు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వచ్చిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలోనూ పోలీసులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. ఓ మంత్రిని ప్రజలు ముట్టడిస్తే పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని అన్నారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం ముస్లిం మత పెద్దలతో జిల్లా అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఘటన వివరాలను వారి నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంగా ముస్లిం నేతలతో బీజేపీ నాయకులు బేటీ అయి చర్చించారు.

మరిన్ని వార్తలు