హోదా.. అత్యాశే !

11 Sep, 2014 01:33 IST|Sakshi
హోదా.. అత్యాశే !
  •  కాంగ్రెస్‌కు ఎస్‌ఎం. కృష్ణ చురక
  •  సంఖ్యా బలం లేకున్నా ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్న
  • మైసూరు : లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ, ఆ స్థానాన్ని కాంగ్రెస్ కోరుకోవడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ అభిప్రాయపడ్డారు. ఇక్కడి జేఎస్‌ఎస్ ఆస్పత్రి ఆవరణలో బుధవారం ఆయన సుత్తూరు దేశికేంద్ర స్వామీజీ 99వ జయంత్యుత్సవంలో పాల్గొన్నారు.

    అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పది శాతం ఓట్లు కూడా లభించలేదని దెప్పి పొడిచారు. ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి 54-55 సీట్లు గెలుపొందాల్సి ఉందన్నారు. అయితే కాంగ్రెస్‌కు కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కాయన్నారు. దేశంలో రాజ్యాంగమే గొప్పదని, దానిని ఉల్లంఘించి చేసే ఎలాంటి పనులకైనా గుర్తింపు ఉండదని చెప్పారు.

    మన కోసం రాజ్యాంగంలో పేర్కొన్న నియమాలను మార్చాలని కోరుకోవడం సరికాదని హితవు పలికారు. ఏదేమైనా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేయడాన్ని విమర్శించారు. అంతకు ముందు జేఎస్‌ఎస్ ఆస్పత్రిలో కొత్త ఆడిటోరియాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదురైన కష్టాలను ఏకరువు పెట్టారు. తనకు ఎదురైన ఇబ్బందులు బహుశా ఏ ముఖ్యమంత్రీ ఎదుర్కొని ఉండరని చెప్పారు.

    ఓ వైపు అడవి దొంగ వీరప్పన్ ఆడిందే ఆటగా తయారైందని, మరో వైపు డాక్టర్ రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేశాడని, ఇంకో వైపు కావేరి జలాల కోసం జయలలిత జగడాలు....అంటూ ఆ సంఘటనలు గుర్తుకు వస్తే ఇప్పటికీ తనకు నిద్ర రాదని వాపోయారు. తన హయాంలో మూడు కరువులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, చివరకు తానే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అన్ని సమస్యలనూ సమర్థంగా ఎదుర్కోగలిగానని ఆయన తెలిపారు.
     

మరిన్ని వార్తలు