అయ్యేపనేనా?

5 Feb, 2014 02:14 IST|Sakshi
అయ్యేపనేనా?

  మళ్లీ పీఎం అయ్యేలా దేవెగౌడ ఎత్తులు
  వ్యూహ రచనలో జేడీఎస్ నిమగ్నం
  లోక్‌సభ సమరంలో 12 స్థానాల్లో గెలవాలని లక్ష్యం
  ‘బెంగళూరు గ్రామీణ’ నుంచి దేవెగౌడ బరిలోకి
  డీకే ప్రాభవాన్ని దెబ్బతీసేలా పావులు
  ‘బెంగళూరు దక్షిణ’ నుంచి నటి రక్షిత పోటీ
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
 రాష్ట్రంలో జేడీఎస్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో, లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు చేకూర్చే దిశగా దళాధిపతి దేవెగౌడ వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. మొత్తం 28కి గాను కనీసం 12 స్థానాలను గెలుచుకుంటే ప్రధాని పదవి మళ్లీ దేవెగౌడను వరించ వచ్చని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి విజయం సాధ్యం కాదనే విషయం వారికీ తెలుసు. కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడానికి దళాధిపతి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు సమాచారం. సంప్రదాయంగా హాసన స్థానం నుంచి పోటీ చేసే గౌడ ఈసారి బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి బరిలో దిగాలనుకుంటున్నారు. జేడీఎస్‌కు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజక వర్గాన్ని ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన్నుకు పోయింది. ఈ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోక పోతే విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ప్రాభవం ఈ నియోజకవర్గంలో అప్రతిహతంగా కొనసాగుతూ పోతుందని దళాధిపతి ఆందోళన చెందుతున్నారు.

 

రాజకీయాల్లో ఆగర్భ శత్రువులైన ఈ రెండు కుటుంబాలు నియోజక వర్గంపై ఆధిపత్యానికి తహతహలాడుతుంటాయి. ప్రస్తుతం శివకుమార్ సోదరుడు సురేశ్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగళూరు గ్రామీణ స్థానం నుంచి గౌడ పోటీ చేస్తే, పక్కనున్న చిక్కబళ్లాపురం, మండ్య, తుమకూరు, చామరాజ నగర నియోజక వర్గాల్లో సైతం జేడీఎస్ అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపునగరంలో పార్టీ గెలుచుకునే అవకాశాలున్నట్లుగా భావిస్తున్న బెంగళూరు సెంట్రల్ నుంచి చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్‌ను పోటీ చేయించాలని ఆలోచనలు సాగుతున్నాయి. అయితే తన సోదరుడు ముజమిల్ అహమ్మద్‌కు టికెట్ ఇవ్వాలని జమీర్ కోరుతున్నారు. బీబీఎంపీ మాజీ కమిషనర్ సిద్ధయ్యను కోలారు, నటి రక్షితను బెంగళూరు దక్షిణ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏ. కృష్ణప్పను తుమకూరుల నుంచి పోటీ చేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు