మా ఎమ్మెల్యేలు డబ్బు అడిగితే ఏంటి..?

4 Jun, 2016 09:37 IST|Sakshi
మా ఎమ్మెల్యేలు డబ్బు అడిగితే ఏంటి..?

బెంగళూరు: బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పోరిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మద్దతుగా మాట్లాడిన మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు స్టింగ్ ఆపరేషన్లో వెలుగుచూడటంపై దేవేగౌడ స్పందిస్తూ.. ఎమ్మెల్యేలు డబ్బులు అడిగితే ఏంటి అంటూ ప్రశ్నించారు.

ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బు అవసరమని దేవేగౌడ అన్నారు. భారత రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. తమ పార్టీపై రాజకీయ కుట్రలో భాగంగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు.

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరగుతున్న వీడియో విడుదలవటం సంచలనం సృష్టిస్తోంది. స్వతంత్ర అభ్యర్థికి ఓటేసేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించగా, మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే జేడీఎస్ ఎమ్మెల్యే మల్లికార్జున కుబా స్టింగ్‌లో పాల్గొన్నాడని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు.

మరిన్ని వార్తలు