‘రైల్వే’ వికాస్ అభివృద్ధికి కృషి

14 Dec, 2014 22:23 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబై రైల్వేవికాస్ అభివృద్ధికి మరింత కృషి చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఇటీవల ఆయన ముంబై సందర్శించిన సందర్భంగా రైల్వే అధికారులతో మాట్లాడారు.  నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసే పనులు విస్తారంగా కొనసాగుతున్నాయని ప్రభు తెలిపారు. వివిధ ప్రాజెక్టుల్లో సమన్వయ లోపంవల్ల ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా నిర్వహించేందుకు ఇకపై రైల్వే నెలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించనుంది.
 
మరో నెల రోజుల్లో ముంబై నగర వాసులు సబర్బన్ రైల్ టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా పొందవచ్చునని రైల్వే మంత్రి ప్రకటించారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే క్రమంలో వీరు ఈ టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరు స్టేషన్‌కు చేరుకోగానే వీరికి కేటాయించిన కోడ్‌ను స్టేషన్‌లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లో వీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వీరు టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా టికెట్ కోసం పొడగాటి క్యూలో ప్రయాణికులు నిలబడాల్సిన అవసరం ఉండదని ప్రభు తెలిపారు.

అంతేకాకుండా మొదటి ఏసీ లోకల్ రైళ్లను ప్రయోగాత్మకంగా 2015 మార్చిలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. రద్దీని నియంత్రించే భాగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  డబుల్ డక్కర్ రైళ్లు, ఎయిర్ కండిషన్డ్ రైళ్లను నడపాల్సిందిగా అధికారులకు సూచించారు. అంతేకాకుండా బస్సు, ట్యాక్సీ సేవలను కూడా మరిన్ని పెంచాలని తెలిపారు. అయితే తాను ఇటీవల శివారు ప్రాంతాల లోకల్ రైళ్లలో ప్రయాణించాననీ, ఆయా ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతుండడాన్ని స్వయంగా గమనించానన్నారు. దీంతో మరికొన్ని ట్రాక్‌లు, మరిన్ని ప్లాట్‌ఫాంల ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు.

అంతేకాకుండా రైళ్ల సంఖ్యను కూడా పెంచాలన్నారు. దీనిద్వారా మరింత మంది రైల్వే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబై రైల్వే వికాస్‌ను మరింత శక్తివంతంగా తీర్చి దిద్దేందుకు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు.అదేవిధంగా మహిళా బోగీలలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభు తెలిపారు.

మరిన్ని వార్తలు