వడగళ్లవానకు దెబ్బతిన్న పంటలకు ప్రత్యేక ప్యాకేజీ

14 Dec, 2014 22:23 IST|Sakshi
వడగళ్లవానకు దెబ్బతిన్న పంటలకు ప్రత్యేక ప్యాకేజీ

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

ముంబై: ఇటీవల కురిసిన వడగళ్లవాన వల్ల నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. వడగళ్ల వాన వల్ల తీవ్రంగా నష్టపోయిన నాసిక్ జిల్లాలోని నిఫాడ్, దిందోరి, చాంద్‌వాడ్ పట్టణాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాగపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల సమయంలోనే బాధిత రైతులకు తగిన నష్టపరిహారాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

‘జిల్లాలోని మాలేగావ్, యవోలా, నంద్‌గావ్, దేవ్లా తాలూకాల్లో వేలాది ఎకరాల పంటలు ఈ వడగళ్ల వాన వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది..’ అని సీఎం స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వడగళ్ల వానకు గోధుమ, ద్రాక్ష, ఉల్లి, మిరప, దానమ్మ వంటి వాణిజ్య పంటలపై తీవ్ర ప్రభావం పడిందని సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై వాతావరణ శాఖతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దీనికోసం అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు