రాసలీలల కేసులో దేవిశ్రీకి బెయిల్

1 May, 2014 02:16 IST|Sakshi
  • ఆమె తన రెండవ భార్యగా పేర్కొన్న స్వామీజీ
  •  తన అనుమతితోనే రెండవ పెళ్లి చేసుకున్నారన్న తొలి భార్య
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలల కేసులో అరెస్టైన దేవిశ్రీ గురూజీ కి బెయిల్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఆరవ ఏసీఎంఎం న్యాయస్థానంలో దేవిశ్రీని పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమకు గురూజీ నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ ఫిర్యాదు మేరకు హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం విదితమే.

    అంతకు ముందే రాసలీలలపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో దేవిశ్రీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులోని ధర్మపురిలో తలదాచుకున్న దేవిశ్రీని మంగళవారం రాత్రి హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు పిలుచుకొచ్చారు. కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే దేవిశ్రీ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రాసలీలలు సాగించినట్లు ప్రసారం అయిన క్లిప్పింగ్‌లలో ఉన్న మహిళ తన రెండవ భార్య అని పేర్కొన్నారు.

    మొదటి భార్య అనుమతితోనే ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు ఉండవని తెలిపారు. ఏనాడు తాను సన్యాసినని చెప్పుకోలేదని స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 నుంచి తనను బ్లాక్‌మెయిల్ చేశారని, తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి రూ. 2.50 లక్షలు డ్రైవర్ వసంత్‌కు ఇచ్చి, మరో ప్రాంతానికి వెళ్లి సుఖంగా జీవించాలని సూచించానని అన్నారు.

    గత ఏడాది మే నుంచి తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ చానెల్‌లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరు కాపురానికి అంగీకరించలేదని చెప్పారు.
     

మరిన్ని వార్తలు